
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అభినందించారు. లాక్ డౌన్ ఆంక్షలను క్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో అన్ లాక్ డౌన్ 1.0 ప్రారంభమైన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు మేఘా సంస్థ చర్యలు చేపట్టింది.
అయితే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పాలు పంచుకోవాల్సిన వందలాది మంది వలస కార్మికులు ఇతర రాష్ట్రాలలోని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళి పోయిన నేపథ్యంలో వారందరినీ తిరిగి నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతానికి తీసుకు రావడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో వలస కార్మికులను వారి వారి స్వస్థలాల నుంచి తీసుకురావడానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు మెగా సంస్థ చర్యలు చేపట్టింది.
ఉత్తరాది రాష్ట్రాలలో ఉండిపోయిన సుమారు 1500 మంది వలస కార్మికులను ప్రత్యేక రైలు ద్వారా పోలవరం నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రాంతానికి తరలించింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. వలస కార్మికులను తరలించడంతో పాటు నిర్మాణ పనులను వెంటనే చేపట్టింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ చూపిన చొరవ కారణంగా పోలవరం నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తుందని రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులను చేపట్టేందుకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.