
నల్లమల అటవీప్రాంతంలో ప్రాచీన తెలుగు శాసనాలు ఇటీవల ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిని ఎక్కువగా అడవిలో ఉండే చెంచులు, గిరిజనులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తుండటంతో ఇవి వెలుగులోకి వస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యం, కాకతీయుల కాలం నాటి తెలుగు శాసనాలు ఇప్పటివరకు 40కి పైగా బయటపడ్డాయి. దక్షిణ భారత చరిత్ర, సంస్కృతిని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయన్న ఉద్దేశంతో వీటిని అధ్యయనం చేసేందుకు భారత పురావస్తు శాఖ తాజాగా నిర్ణయించి అటవీశాఖ అధికారులను అనుమతి కోరింది. 12 – 16 శతాబ్దాల నాటివిగా గుర్తించిన ఈ తెలుగు శాసనాలను అధ్యయనం చేసేందుకు అటవీ అధికారుల అనుమతి లభించడంతో మరితంగా పరిశోధనలు జరగనున్నాయి.
ప్రకాశంజిల్లా కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి గ్రామ సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్దిగ రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు. అంతేకాకుండా సీతమ్మవారు స్నానమాచరించినందుకు రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తొవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని అర్చకులు తెలిపారు. అలానే ఆలయ ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని ఆలయంలో అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, వీరభద్రుడు నాగేంద్రుడు ఇలా కొన్ని విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..