
భారత పురావస్తు శాఖ.. అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక సంపదను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే నల్లమల, లంకమల, శేషాచలం అడవుల్లో పురావస్తు శాఖ సర్వే నిర్వహిస్తోంది. అటవీ శాఖ సహకారంతో అభయారణ్యాల్లో వాటి జాడను కనుగొనే పనిలో పడింది. శేషాచలం అభయారణ్యంలో శాసన సంపద వెలికి తీసే ప్రయత్నంలోనే సదాశివకోనలో ఏఎస్ఐ సర్వే చేపట్టింది. 16 వ శతాబ్దపు విజయనగరం కాలం నాటి శాసనాలను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రాతి శిలలపై నాటి లిపితో ఉన్న శాసనాలు గుర్తించింది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో భారత పురావస్తు శాఖ అభయారణ్యాల్లో దాగివున్న చారిత్రక నిజాలను బయటపెడుతోంది. ఇప్పటికీ లంకమల, నల్లమల అడవుల్లో అడివి శాఖతో కలిసి పురావస్తు శాఖ సర్వే పూర్తి చేసింది. ఒకటో శతాబ్దానికి ముందు నుంచే నల్లమలలో శ్రీశైలం ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా స్పష్టం చేస్తున్న పురావస్తు శాఖ శ్రీకృష్ణ దేవరాయలు, శివాజీ సహా ఎందరో శ్రీశైలంనీ దర్శించినట్లు గుర్తించింది. పల్లవులు కాకతీయ రాజులు చేసిన అభివృద్ధిపై పలు శిలా శాసనాలను గుర్తించిన పురావస్తు శాఖ వాటి వివరాలు భద్రపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 38 శాసనాలను గుర్తించి శ్రీశైల మల్లికార్జునుడి ఆలయ ప్రాశస్త్యాన్ని శాసనాల ద్వారా పురావస్తు శాఖ తెలుసుకుంది. ఆదిమానవుడి ఆవాసాలు, అందుకు తగ్గ సాక్షాలతోపాటు 2వ శతాబ్దం నాటి శానివాహనుల పాలనకు సంబంధించిన ఎన్నో శాసనాలను పురావస్తు శాఖ బయటపెడుతోంది. ఇందులో భాగంగానే ఎక్కువ టూరిజం అభివృద్ధి కోసం ఏపీ సర్కార్ కూడా అడుగులు వేస్తోంది. మైసూర్ ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి శేషాచలం అభయారణ్యం శాసన సంపద వెలికితీసే ప్రయత్నం పురావస్తు శాఖ చేస్తోంది.
సదాశివకోనలో ఏఎస్ఐ సర్వేలో బయట పడ్డ శాసనాలు 16 వ శతాబ్దపు విజయనగరం కాలం నాటివిగా గుర్తించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రాతి శిలలపై ఉన్న లిపిని ఆ శాసనాల్లో దాగి ఉన్న సమాచారాన్ని గుర్తించింది. దట్టమైన అడవి ప్రాంతంలో దాగి ఉన్న రహస్యాలను శతాబ్దాల చరిత్రను వెలుగులోకి తెచ్చింది. ముక్కంటిశ్వరుడికి భక్తితో నీరాజనాలు అర్పించిన మహనీయుల ఔదార్యాన్ని చాటి చెప్పే శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఇందులో భాగంగానే సదాశివకోన చరిత్రతో పాటు మూడో శతాబ్దానికి చెందిన గుడిమల్లం ఆలయ నిర్మాణం, జరిగిన అభివృద్ధిపై శాసనాల ద్వారా బయటపెట్టింది. రాతి బండలపై అరుదైన శిలాశాసనాలను గుర్తించిన పురావస్తు శాఖ అధికారుల బృందం 1471 వ సంవత్సరం నాటి శాసనాన్ని కాపీ చేసింది. గుడిమల్లం శ్రీ పరుశరామేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పూజలు, నైవేద్యాలు, వైభవాల నిర్వహణకు గాను దానంగా ఇచ్చిన భూముల వివరాలు సదాశివకోనలోని పుష్కరిణి నిర్మాణం సంబంధించిన ఆధారాలు శాసనాల్లో బయట పడ్డాయి. ఇక శాసనాల్లో జాఠాయుడుదైన పరమశివుడు ఉగ్రరూపంలో నృత్యం చేస్తున్న ఆకారం శాసనాల్లో చెక్కబడి ఉన్నట్లు శాఖ గుర్తించింది.
ఇక ఎన్నో శాసన ఆధారాలు కాల గర్భంలో కలిసిపోయిన సమయంలో భారత పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా భారత్ శ్రీ ప్రాజెక్టు ద్వారా శాసనాలను గుర్తించే పనిలో పడింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 86 వేల శాసనాలను గుర్తించిన కేంద్రం దేశ సంస్కృతి చరిత్రను భవిష్యత్తు తరాలకు అందజేసే ప్రయత్నం చేస్తుంది. గుర్తించిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తోంది. భారత్ శ్రీ అనే వెబ్ పోర్టల్ లో అప్లోడ్ చేస్తున్న భారత పురావస్తు శాఖ భవిష్యత్తు తరాలకు అపారమైన చరిత్రను అందించే ప్రయత్నం చేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..