
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక స్కూలు క్లాస్‌రూమ్‌లో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఉన్న అప్ డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
పోలీసులు, స్కూలు టీచర్లు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 1వ తేదీ ఉదయం 10:30 గంటల సమయంలో పాఠశాలలో తరగతులు జరుగుతున్నాయి. అప్పటికే నిర్మాణాలు జరుగుతున్నందున గేటు తెరిచి ఉంది. ఇదే అదనుగా భావించిన నిందితుడు, బయటే రంపాన్ని ఆన్ చేసి, నేరుగా పదో తరగతి గదిలోకి దూసుకొచ్చాడు. క్లాసులో ఉన్న విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేశాడు. ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా ఈ దాడిలో గాయపడింది. ఈ అనూహ్య ఘటనతో భయపడిన విద్యార్థులంతా అరుపులతో బయటకు పరుగులు తీశారు.
ఘటన జరిగిన సమయంలో క్లాస్ రూంలో ఉన్న గణిత టీచర్ మాట్లాడుతూ, “బయట నుంచి మోటార్ సౌండ్ వచ్చింది. నిర్మాణ పనులు అనుకున్నాం. వాడు ఇన్స్ట్రుమెంట్ తీసుకుని నేరుగా లోపలికి వచ్చేశాడు. తేరుకునే లోపే దాడి జరిగిపోయింది. పిల్లలు చాలా భయపడిపోయారు.” అని తెలిపారు. నిందితుడు తన రంపాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. గాయపడిన విద్యార్థినులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఈ కేసులో హేమంత్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడు బాధితురాలైన విద్యార్థినికి బంధువని నిర్ధారించారు. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 1న ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో, అక్కడికి వెళ్లిన పోలీసులపై హేమంత్ దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు గాలిలో కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ, నిందితుడు తగ్గకుండా ఒక పోలీసు ఇన్స్పెక్టర్ను గాయపరిచాడు. అనంతరం పోలీసులు అతనిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, అతడికి ఆరు బుల్లెట్ గాయాలయ్యాయి. చికిత్సలో భాగంగా అతడి కుడి కాలును తొలగించాల్సి వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైతే రెండో ఎడమ కాలు కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
గాయపడిన రెండో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రంపం కాలుపై పడటం వల్ల ఎక్స్టెన్సర్ టెండన్స్ తెగిపోయి లోతైన గాయం అయిందని, బొటనవేలు పక్కకు పోయిందని.. అది సరిచేసి.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వైద్యులు వివరించారు.
రాప్తాడు ఘటనపై రాష్ట్రంలోని రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న బాలికను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఇలాంటి సంఘటనల వలన పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, వారికి మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించి, భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 20 మంది మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను రాప్తాడులోనే నియమించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.