రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ సందర్భంగా నవరత్నాల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసినపుడు ప్రత్యేక వాహనంపై ఆయన మైదానమంతా తిరుగుతూ అక్కడకు వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. అదే తరహాలోనే జగన్ కూడా చేయనున్నారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరుతారు. అక్కడి నుంచి విజయవాడలోని ప్రమాణ స్వీకార వేదికైన ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానానికి వస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై జగన్ చుట్టూ తిరుగుతూ గ్యాలరీల్లో ఉన్న వారికి అభివాదం చేస్తారు. అనంతరం సభావేదికపైకి చేరుకుంటారు. జగన్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత గవర్నర్ వెనువెంటనే వెళ్లిపోతారు. అనంతరం జగన్ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాదాపు 20నిమిషాల వరకూ ఆయన ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత బుధవారం విజయవాడకు చేరుకున్న గవర్నర్‌ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రక్రియను అధికారులు వారికి వివరించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌కు పశ్చిమ్‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ హాజరుపై బుధవారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. మొత్తం 15వేల పాస్‌లను పంపిణీ చేశామని, మైదానం మధ్యలో వీరంతా కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్లాక్‌లను ఏర్పాటు చేశామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మైదానం గ్యాలరీల్లోకి సాధారణ జనం పాస్‌లు లేకుండా వెళ్లి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూడవచ్చన్నారు.