గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిపై కనిపించిన కరెన్సీ బ్యాగ్ కలకలం రేపింది. జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో పెద్దమొత్తంలో కనిపించిన 2వేలు, 500 కరెన్సీ నోట్లను చూసిన పోలీసులు, స్థానికులు షాక్ తిన్నారు.
జిల్లాలోని గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం వద్ద కరెన్సీ కట్టల వ్యవహారం కలకలంరేపింది. వెంగళాయపాలెం దగ్గర హైవేపై కనిపించిన బ్యాగ్‌ను చూసిన స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగును పరిశీలించారు. బ్యాగును స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని తెరిచి చూడగా… అందులో రెండు వేలు, ఐదు వందల నోట్లు కనిపించాయి. పైగా అది నకిలీ కరెన్సీగా గుర్తించారు..అలాగే రెండు వేల నోటుపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్రించి ఉన్నట్లుగా గుంటూరు సౌత్ డీఎస్పీ కమలాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ కరెన్సీ బ్యాగును వెంగళాయపాలెం దగ్గర హైవేపై వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కరెన్సీ మొత్తం 2.5 కోట్ల రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఆ బ్యాగును రోడ్డుపై ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామని స్పష్టం చేశారు.