నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చేందుకు ఇష్టపడని రైతులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భూములను ఇచ్చేందుకు ఇష్టపడని వారి నుంచి భూములు తీసుకోవడం అవసరమా..? అని ఆయన ప్రశ్నించారు. అధికారుల బలవంతం వల్లనే ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు తదితర గ్రామాల్లోని ప్రజలు తమ భూములను ఇచ్చామని గతంలో తనకు చెప్పారని వ్యాఖ్యానించిన జగన్.. ఏ అవసరాల కోసం ఆ భూముల్ని తీసుకోవాలనుకుంటున్నారని అడిగారు.
సీఆర్డీఏ అధికారులతో బుధవారం జగన్ దాదాపు మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భూ సమీకరణలో ఎంత భూమిని తీసుకున్నారు..? రైతులు ఎంతమంది భూములిచ్చారు..? వారికి కేటాయించిన ప్లాట్లు ఎన్ని..? మొదలు పెట్టిన పనుల్లో 25శాతం దాటినవి ఎన్ని..? తదితర అంశాలపై అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.