ఏపీకి పెద్ద రాజధాని ప్రమాదకరం: శివరామకృష్ణ కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా కరెక్ట్‌ కాదని ఆ నివేదిక తెలియచేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్‌ డవలప్‌మెంట్‌ ఏరియా గోవా రాష్ట్రానికంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఇంత పెద్ద ప్రాంతాన్ని పట్టణీకరణ […]

ఏపీకి పెద్ద రాజధాని ప్రమాదకరం: శివరామకృష్ణ కమిటీ

Edited By:

Updated on: Aug 21, 2019 | 12:01 PM

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా కరెక్ట్‌ కాదని ఆ నివేదిక తెలియచేసింది.

విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్‌ డవలప్‌మెంట్‌ ఏరియా గోవా రాష్ట్రానికంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఇంత పెద్ద ప్రాంతాన్ని పట్టణీకరణ చేసి, హైదరాబాద్‌లో మాదిరిగా రింగ్‌రోడ్‌ నిర్మించడం సరికాదంది. దేశంలోనే అత్యుత్తమ సాగు భూములు ఉన్న ఈ ప్రాంతంలో చిన్న కమతాలు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది. వీరంతా ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని పేర్కొంది. కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడమే గాకుండా.. కృత్రిమంగా రియల్‌ వ్యాపారం పెరుగుతుందని కూడా కమిటీ హెచ్చరించింది. దీనివల్ల సామాజికంగా కూడా ఎన్నో అనర్థాలు జరుగుతాయంది.

విజయవాడ, గుంటూరు నగరాలు సహజంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు నగరాల మధ్య ప్రాంతం కూడా తనంతట తానే అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సమయంలో అక్కడ రాజధాని పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టి, భారీ ఎత్తున ప్రజల్ని అక్కడ దింపడం సరికాదని తెలిపింది. రాజధానికి వ్యవసాయ భూముల్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతంలో నీరు పై పొరల్లోనే ఉంటుంది. నేల లూజ్‌గా ఉంటుంది. అందువల్ల భారీ నిర్మాణాలకు పునాదులు తీయడం భారీ ఖర్చుతో కూడుకుని ఉంటుందని కూడా శివరామకృష్ణన్‌ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే సామాజిక, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయని, కొందరు రియల్‌ వ్యాపారులు మాత్రమే లాభపడతారని కూడా కమిటీ తన నివేదికలో తేల్చి చెప్పింది.