జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అనుమతి ఇవ్వాలని సూచించారు. ఈ పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇప్పటివరకూ 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని, 45.63 లక్షల లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేశామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అనుమతి ఇస్తామని చెప్పారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. విచారణ నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం తగినన్ని స్టాంపు పేపర్లను తెప్పించుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేపట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ నవంబర్ 20 నుంచి ప్రారంభించి.. డిసెంబర్ 15 వరకు చేపట్టాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
Read Also.. AP Assembly Session: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పటినుంచంటే..?