ఎందుకు ఇలా చేశావురా బాబు.. ఉద్యోగానికి వెళ్లమని మందలించిన తల్లిదండ్రులు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం మాదలింగిలో జరిగిన ఆత్మహత్య ఘటన స్థానికులను కలిచివేసింది. భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగం చేసుకోవాలని హెచ్చరించిన తల్లిదండ్రుల మాటలకు మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎందుకు ఇలా చేశావురా బాబు.. ఉద్యోగానికి వెళ్లమని మందలించిన తల్లిదండ్రులు..!
Young Man Suicide

Edited By: Balaraju Goud

Updated on: Nov 29, 2025 | 8:20 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం మాదలింగిలో జరిగిన ఆత్మహత్య ఘటన స్థానికులను కలిచివేసింది. భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగం చేసుకోవాలని హెచ్చరించిన తల్లిదండ్రుల మాటలకు మనస్తాపం చెంది యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మాదలింగి గ్రామానికి చెందిన బి. మధుసూదనరావు (27) అనే యువకుడు విశాఖపట్నంలోనే ఒక ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం తన కుటుంబాన్ని చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. ప్రతిరోజు తన గ్రామంలో గ్రామస్తులతో పాటు స్నేహితులతో సరదాగా గడిపేవాడు. ఈ క్రమంలోనే మధుసూదనరావుకి సెలవులు పూర్తయ్యాయి. అయితే అతను మాత్రం తిరిగి ఉద్యోగానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లమని బుజ్జగించారు.

ఇంటి వద్ద ఉన్న సమయంలో మధుసూదనరావు తరచూ ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో పెద్దగా మాట్లాడకపోవడం, రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవడం కుటుంబ సభ్యులు గమనించినప్పటికీ అది అంత పెద్ద విషయంగా భావించలేదు. మధుసూదనరావుకి ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. పెళ్లి విషయం పై కూడా ఇంట్లో కొన్ని సార్లు మాట్లాడుకున్నారు. ఉద్యోగంలో బాగా సెటిల్ అయితే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలోనే సెలవులు అయిపోవడంతో ఇక డ్యూటీకి వెళ్లాలని తల్లిదండ్రులు మధుసూదనరావుకి చెప్పారు.

అయితే అతను మాత్రం ఇక ఉద్యోగం వద్దు, వెళ్లను.. అని చెప్పడంతో మధుసూదనరావు మాటలతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతన్ని మందలించారు. ఆ మాటలు అతనికి మానసికంగా కుంగదీశాయి. దీంతో శుక్రవారం (నవంబర్ 28) ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటి తరువాత విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పార్వతీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని మరో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో తుది శ్వాస విడిచాడు మధుసూదనరావు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువకుడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..