ఆధార్ అప్‌డేట్ పేరుతో నయా మోసం.. మెడలోని నగలు తీయించి ఉడాయించిన కేటుగాళ్లు!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం చిన్న గోపవరం గ్రామంలో రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు ఇద్దరు కేటగాళ్లు.

ఆధార్ అప్‌డేట్ పేరుతో నయా మోసం.. మెడలోని నగలు తీయించి ఉడాయించిన కేటుగాళ్లు!
Fraud
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 09, 2024 | 1:27 PM

దొంగతనం చేసే వాళ్ళకి ఐడియాలు కోకొల్లలు అట్టే పుట్టుకొచ్చేస్తాయి. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దొంగతనం ఐడియాలతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు కేటుగాళ్లు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలని చెప్పి నమ్మబలికి, ఫోటో తీయాలి అని మెడలోని బంగారం అంతా తీసి పక్కన పెట్టించారు. వాటిని తీసుకుని ఉడాయించారు ఇద్దరు కేటుగాళ్లు. ఈ విచిత్ర ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం చిన్న గోపవరం గ్రామంలో రామలక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు ఇద్దరు కేటగాళ్లు. ఆధార్ అప్‌డేట్ కోసం వచ్చామని అభివృద్ధి నమ్మబలికించారు. వివరాలన్నీ తెలుసుకుని ఆధార్ అప్‌డేట్ కోసం ఫోటో తీయాలి అని చెప్పి, మెడలోని బంగారం అంతా తీయించి పక్కన పెట్టించారు. ఫోటోలలో బంగారు ఆభరణాలు ఉండకూడదని, ఆధార్‌లో అవి ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆ వృద్ధురాలిని ఆ కేటుగాళ్లు నమ్మబలికారు.

అంతే వారి మాటలను నమ్మిన రామలక్ష్మమ్మ తన మెడలోని బంగారం అంతా తీసి పక్కనపెట్టి ఫోటో దిగేందుకు సిద్ధమైంది. అంతే చక్కగా ఒక ఫోటో తీసి పక్కనే ఉన్న బంగారం అంతా చేత పట్టుకుని అక్కడి నుంచి చాకచక్యంగా దొంగతనం చేసి ఇద్దరు కేటుగాళ్లు పరారయ్యారు. వారు వెళ్లిన తర్వాత ఆలస్యంగా పక్కన పెట్టిన బంగారాన్ని చూసుకున్న రామలక్ష్మమ్మ కంగుతిని జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోని కొన్ని సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా, ఆ ఇద్దరి మొహాలు బయటపడ్డాయి. అయితే వారు ఎక్కడి వారు ఏంటి అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అందుకే ఇప్పటికైనా ఇంటికి వచ్చేవారు ఎవరు ఎందుకు వచ్చారు వారు నిజమైన ప్రభుత్వ ఉద్యోగులైన లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వారిని ఇంటిలోకి అనుమతిస్తే మంచిది, లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అపరిచత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వీడియో చూడండి…

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..