హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!

కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారిపై ఆదివారం (జూన్ 07) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను సామర్లకోటకు చెందిన జోరెడ్డి వెంకట సూర్యనారాయణ, అరుణ కుమారిగా గొల్లప్రోలు పోలీసులు గుర్తించారు.

హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
Road Accident

Updated on: Jun 07, 2026 | 7:37 PM

కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారిపై ఆదివారం (జూన్ 07) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో ఒక శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను సామర్లకోటకు చెందిన జోరెడ్డి వెంకట సూర్యనారాయణ, అరుణ కుమారిగా గొల్లప్రోలు పోలీసులు గుర్తించారు.

రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సూర్యనారాయణ హెల్మెట్ ధరించే బైక్ నడుపుతున్నారు. వారు చేబ్రోలు నుంచి కత్తిపూడి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక వేగవంతమైన టిప్పర్ లారీ వీరి యాక్సిస్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ రోడ్డుపైకి తూలి పడ్డారు. దురదృష్టవశాత్తూ, ఆయన హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ, లారీ భారీ చక్రాలు నేరుగా ఆయన తల మీదుగా దూసుకుపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణరక్షణ కవచంగా భావించే హెల్మెట్ ఉన్నా కూడా, లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు దక్కకపోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.

మరోవైపు బైక్ వెనుక కూర్చున్న భార్య అరుణ కుమారి కూడా రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే స్పందించి, ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె కూడా ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న దంపతులు ఇలా క్షణాల వ్యవధిలో అనంత లోకాలకు వెళ్ళిపోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us