మనిషి అత్యాశ, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న అతి కోరిక జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అందమైన జీవింత క్షణాల్లో తలకిందులవుతుంది. సమాజంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా మనిషి ఆలోచన మాత్రం మారడం లేదు.
కష్టపడి సంపాదించుకుండా డబ్బులు వస్తాయనే అత్యాశ జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. మంచి జీతం. ఇటీవలే వివాహం జరిగింది. ఐదు నెలల పసిపాప. ఇంకేముంది జీవితమంతా సంతోషంగా గడేపయడమే అయితే. అంతలోనే ఓ పెను విషాదం చోటు చేసుకుంది. అత్యాశ అతని జీవితాన్ని నాశనం చేసింది. అతన్ని నమ్ముకున్న భార్య, బిడ్డను రోడ్డున పడేసింది. వివరాల్లోకి వెళితే..
పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి (34) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవలే వివాహం జరిగిన గంగిరెడ్డికి ఐదు నెలల పాప ఉంది. అయితే ఈ సమయంలోనే గంగిరెడ్డి బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్స్‌లో నష్టాలు రావడంతో అప్పు చేసి మరీ బెట్టింగ్‌లు పెట్టాడు. దీంతో చూస్తుండగానే అప్పు కొండలా పెరిగిపోయింది. పరిస్థితి చేయి దాటి పోయింది. ఏకంగా రూ. 40 లక్షలు కోల్పోయాడు.
దీంతో అప్పుల బాధ పెరగడంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. కట్టుకున్న భార్య, పసిపాపను వదిలి శాశ్వత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అప్పుల బాధలు భరించలేక సోమవారం పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై తనువు చాలించాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మంచి ఉద్యోగం, సంతోషంగా జీవిస్తున్న వ్యక్తి ఇలాంటి పని చేయడంతో కుటుంబీకులు రోదిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..