
ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ శ్రీకాకుళం జిల్లా? బంగ్లాదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తీరానికి రావాలి అంటే మధ్యలో భారత్‌లోని పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలను దాటుకుని రావాల్సి ఉంటుంది. కానీ ఎలా వచ్చిందో ఏమో కానీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసవానిపేట సమీపానికి సముద్రంలో బంగ్లాదేశీయుల పడవ కొట్టుకు వచ్చింది. అందులో మొత్తం 13 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. మూసవానిపేటకు కేవలం రెండు నాటికన్ మైళ్ళు దూరంలో వారి పడవ లంగరు వేసి ఉంది. అయితే అటుగా సముద్రంలో వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులకు ఆ పడవ కొత్తగా కనిపించింది. గతంలో ఎప్పుడూ వాళ్ళు ఆ పడవను చూడలేదు. పైగా పడవలో ఉన్న మనుషులను కూడా వారు ఎప్పుడూ చూడలేదు.
వారంతా కొత్తవారు. దీంతో అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మూడు బోట్లతో సముద్రంలోకి వెళ్లిన మెరైన్ పోలీసులు బంగ్లాదేశీయులని పట్టుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే వారు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు.? పడవను ఎందుకు అక్కడ లంగరు వేసారు? వంటి విషయాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ పట్టుబడిన బాంగ్లాదేశీయులు ఆకలితో నీరసంగా ఉండటం, భయంతో వారు ఎక్కువగా మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తీరానికి చేరాక చలి కారణంగా వణికిపోతున్న బంగ్లాదేశీయుల పరిస్థితి చూసి స్థానికులు వారికి చలి మంటలు వేసి, వేడివేడిగా టీ, బిస్కెట్స్ ఇచ్చారు.తర్వాత వంటలు చేసి కడుపు నిండా భోజనం పెట్టీ వారి ఆకలి తీర్చారు.
పట్టుబడిన 13 మంది బంగ్లాదేశీయులను కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిని పోలీసులు ప్రశ్నించగా తామంతా బంగ్లాదేసియులమని, సముద్రంలో వేట చేస్తూ తెలియక శ్రీకాకుళం జిల్లా తీరానికి తమ పడవ కొట్టుకువచ్చిందని వారు తెలిపారు. 20రోజుల కిందట బంగ్లాదేశ్ నుంచి బయలుదేరగా.. దారి తప్పి భారత్ జలాల్లోకి ప్రవేశించామని వారు తెలిపారు. గత ఐదు రోజులుగా పడవలో ఇంధనం, తాము తెచ్చుకున్న ఆహార దినుసులు అయిపోవటంతో ఎటు వెళ్ళాలో తెలియక పడవని అక్కడ లంగరు వేసి ఉన్నామని వారు తెలిపారు. అయితే అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించటం వల్ల వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని మెరైన్ సీఐ చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసలు దేశ సరిహద్దుకు దాటి బెంగాల్ ,ఒరిస్సా రెండు రాష్ట్రాలలను దాటుకొని వస్తె నిఘా వ్యవస్థ ఏమి చేస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.