అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ రేసులో ఉన్న అభ్యర్థులు విస్త్రుతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. తమ బలాలతో పాటు ప్రత్యర్థుల బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే డెమోక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న సెనేటర్ కమల హారిస్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
భారత సంతతికి చెందిన కమల హారిస్..2020 అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నారు. ప్రత్యర్ధి ట్రంప్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముమ్మరంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎలాగైనా పోటీలో నిలబడి ట్రంప్‌ను మట్టి కరిపించాలనే గట్టి పట్టుదలతో..వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్న కమల..ఓటర్లను ఆకర్షించేందుకు వెరైటీ రూట్‌ను ఫాలో అవుతున్నారు. మద్రాస్ నగర మూలాలు ఉన్న ఈమె.. భారతీయులపై దృష్టి పెట్టారు.
ప్రముఖ ఇండో-అమెరికన్ నటి, రచయిత మిండీ కలింగ్‌తో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్‌ఏంజిల్స్‌లోని మిండీ నివాసంలో దక్షిణ భారత వంటకమైన మసాలా దోస వేసి కాసేపు సరదాగా గడిపారు. ఇండియాతో తమకున్న అనుబంధం గురించి చర్చించుకున్నారు కమల, మిండీ. ఈ వీడియోను కమల హారిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. లక్షలకొద్దీ వ్యూస్, లైకులు, షేర్లు వస్తున్నాయి. దీంతో ఇది ప్రవాస ఓటర్లను మచ్చిక చేసుకునే వ్యూహంలో భాగమేనంటున్నారు విశ్లేషకులు.