Pakistan PM Shehbaz Sharif: పాకిస్థాన్ కొత్త ప్రధాని షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా(Saudi Arabia) పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది. పాక్ ప్రధాని హోదాలో ఆయన తొలి విదేశీ పర్యటన(సౌదీ అరేబియా) చేపట్టారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారంనాడు మదీనాలోని పవిత్ర మసీదీ నబావి(Masjid-e-Nabawi)ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పాక్ కొత్త ప్రధానిని చూసిన వందలాది మంది భక్తులు.. ‘ఛోర్.. ఛోర్’ (దొంగ.. దొంగ) అంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీటిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలు వీడియోలు సౌదీ అరేబియా టీవీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. అటు పాకిస్థాన్‌లోనూ సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
మదీనా పవిత్రకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు ఈ ఘటనకు బాధ్యులైన పలువురిని స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధాని మదీనాను దర్శించుకున్న సమయంలో ఆ దేశ సమాచార శాఖ మంత్రి మర్యం ఔరంగజీబ్, జాతీయ అసెంబ్లీ సభ్యుడు షాజెయిన్ బుగ్తి, పలువురు సీనియర్ అధికారులు ఉన్నట్లు పాకిస్థాన్ న్యూస్ ఛానళ్లు, ఆన్‌లైన్ పోర్టల్స్ తెలిపాయి.
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. వీడియో చూడండి
The Pakistani delegation surrounded by people yelling “chor chor” when they made their way to Masjid-e-Nabwi in Madina.
PM Shehbaz Sharif is in Saudi Arabia for a three day tour. #ShehbazSharif #SaudiArabia pic.twitter.com/aRuVmOwWrH
— The Current (@TheCurrentPK) April 28, 2022
పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు సౌదీ అరేబియాలో చేదు అనుభవం ఎదురుకావడం వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమేయం ఉన్నట్లు మంత్రి మర్యం ఔరంగజీబ్ ఆరోపించారు. మదీనాలో రాజకీయాలు మాట్లాడటం.. ఆ వ్యక్తి పేరు ప్రస్తావించడం తనకు ఇష్టంలేదంటూనే.. వాళ్లు సమాజాన్ని (పాకిస్థాన్) భ్రష్టుపట్టించారని ఆరోపించారు.
మదీనాలో షాబాద్ షరీఫ్‌కు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్న వీడియోలను ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ టెహ్రికీ ఇన్సాఫ్(PTI) నేతలు ట్వీట్ చేశారు. అయితే పవిత్రమైన మదీనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సరికాదంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారు.
అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్‌ను పదవీచ్యుతుణ్ని చేసిన షాబాజ్ షరీఫ్.. ఏప్రిల్ 11న పాకిస్థాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న షాబాజ్ షరీఫ్.. ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి పాక్‌ను గట్టెక్కించేందుకు 3.2 బిల్లియన్ డాలర్ల అదనపు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు ఇక్కడ చదవండి..
Also Read..