
వెనిజులాలో రెండు వారాల క్రితం సంభవించిన రెండు భారీ భూకంపాల్లో మృతుల సంఖ్య (Venezuela Earthquake Death Toll) అంతకంతకూ పెరుగుతోంది. ఈ భూకంపాల్లో ఇప్పటివరకు 4 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అధికారిక లెక్కల మేరకు భూకంప విపత్తులో ఇప్పటి వరకు 4,118 మంది మృతి చెందగా.. 16,740 మంది గాయపడినట్లు గుర్తించారు. వేలాది మంది ఆచూకీ తెలియడం లేదు. జూన్ 24న వెనిజులా దేశంలో 39 సెకన్ల వ్యవధిలో 7.5, 7.2 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించగా.. పలు బహుళ అంతస్థలు భవంతులు నేలకూలాయి. తీర ప్రాంతమైన లా గ్వెయిరా రాష్ట్రంలో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. వేలాది మంది భవన శిథిలాల కింద చిక్కుకపోవడంతో..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
భవన శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం చేపట్టిన ఆపరేషన్‌ను రిస్క్యూ టీమ్స్ నిలిపివేశాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ వారి కోసం, కనీసం మృతదేహాలు లభ్యమైతే గౌరవప్రదమైన అంత్యక్రియలు చేయాలని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు శుక్రవారం కారకాస్‌లో 3.0 తీవ్రతతో భూకంపం సంభవించడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. స్థానికంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గత కొన్నేళ్లుగా వెనిజులా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు భూకంపం సంభవించడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయంగా మార్చింది. ఆర్థిక వనరులు కొరత సహాయ, పునరావాస చర్యలకు తీవ్ర విఘాతంగా మారింది. వరుస భూకంపాలతో వేలాది మంది నిరాశ్రయులుగా మారడంతో.. వారికి పునరావాస వసతులు కల్పించడం సవాలుగా మారింది.
భూకంప వినాశనం నుండి కోలుకోవడానికి, పునర్నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు అవసరమవుతాయని, ఇందుకోసం ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆర్థికంగా సహాయం చేయాలని వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కోరారు. కష్టకాలంలో వెనిజులాకు అండగా నిలవాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.