ఖతార్ తీరంలో మరో దాడి.. వరుస నౌకల దాడులతో గజగజలాడుతున్న సముద్ర మార్గం!

పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రస్తుతం అస్థిరతకు నిలయంగా మారింది. గత కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. తాజా ఘటనలో, ఆదివారం ఖతార్ తీరానికి సమీపంలో ఒక సరుకు రవాణా నౌకపై క్షిపణి లేదా గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది.

ఖతార్ తీరంలో మరో దాడి.. వరుస నౌకల దాడులతో గజగజలాడుతున్న సముద్ర మార్గం!
British Ship Catches Fire

Updated on: May 10, 2026 | 5:08 PM

పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రస్తుతం అస్థిరతకు నిలయంగా మారింది. గత కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. తాజా ఘటనలో, ఆదివారం ఖతార్ తీరానికి సమీపంలో ఒక సరుకు రవాణా నౌకపై క్షిపణి లేదా గుర్తుతెలియని ఆయుధంతో దాడి జరిగింది.

యునైటెడ్ కింగ్‌డమ్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) నివేదిక ప్రకారం, ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా 43 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగినప్పటికీ, సిబ్బంది అప్రమత్తతతో వాటిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని యునైటెడ్ కింగ్‌డమ్ సముద్ర భద్రతా సంస్థ పేర్కొంది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ధిక్కరిస్తున్నాయన్న కారణంతో, గత వారం అమెరికా రెండు ఇరాన్ ట్యాంకర్లను అడ్డుకుంది. దీనికి ప్రతిస్పందనగా, తమ నౌకలపై దాడులు కొనసాగితే పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ దాడులు చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. ఈ ప్రతీకార చర్యల పరంపరలో భాగంగానే తాజా దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఉద్రిక్తతలు కేవలం అమెరికా-ఇరాన్లకే పరిమితం కాకుండా, ఇతర దేశాల నౌకలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 8న హోర్ముజ్ జలసంధి వద్ద ఒక భారతీయ నౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటు మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ‘జేవీ ఇన్నోవేషనల్’ ట్యాంకర్‌పై కూడా గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకమైన హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రత క్షీణించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us