తండ్రి ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కిన అక్కాచెల్లెళ్లు.. అన్నకు జడ్జి షాక్!

Equal Inheritance: విల్లు రాయకుండా తండ్రి చనిపోవడంతో ఆస్తి పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం మొదలైంది. ముగ్గురు అక్కా చెల్లెళ్లకు తెలియకుండా సోదరుడు రూ. 3 కోట్ల క్యాష్‌, భారత్‌లో దాచిన రూ.5 కోట్ల విలువైన బంగారాన్ని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. దీంతో సోదరుడిపై అక్కా చెల్లెళ్లు కోర్టులో పోరాటానికి దిగారు. చివరకు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో సోదరుడికి గట్టి షాక్ తగిలింది. అక్కా చెల్లెళ్ల న్యాయపోరాటానికి అయిన దాదాపు రూ.80 వేల పౌండ్ల ఖర్చు (సుమారు రూ.94 లక్షలు) కూడా అతడే చెల్లించాలని ఆదేశించారు. అసలు ఈ ఆస్తుల గొడవలో ఏం జరిగింది? భారత్‌లో దాచిన బంగారం కథేంటి?

తండ్రి ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కిన అక్కాచెల్లెళ్లు.. అన్నకు జడ్జి షాక్!
Uk Sisters Win 1.6 Million Pounds Inheritance Battle Against Brother Over Gold Hidden In India

Updated on: Nov 18, 2026 | 7:02 PM

ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు కోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటాం. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని సమానంగా పంచుకోవాల్సిన సమయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి ఘటనే బ్రిటన్‌లో వెలుగు చూసింది. తండ్రి వదిలి వెళ్లిన కోట్లాది రూపాయల ఆస్తిలో తమకు రావాల్సిన వాటా కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏకంగా సోదరుడిపైనే న్యాయపోరాటం చేశారు. ఈ కేసులో భారత్‌లోని బ్యాంకు లాకర్‌లో ఉన్న బంగారం కూడా కీలకంగా మారింది.

రూ.17 కోట్ల ఆస్తి.. కొడుకు లెక్కల్లో చూపించింది మాత్రం రూ.10 కోట్లే!

బ్రిటన్‌కు చెందిన 85 ఏళ్ల హరి గ్రోవర్ 2024 సెప్టెంబర్‌లో మరణించారు. ఆయనకు ఎయిరన్ గ్రోవర్-జోన్స్, కిరణ్ కాటెరెల్, కెల్లీ పురి అనే ముగ్గురు కుమార్తెలు, సన్నీ గ్రోవర్ అనే కుమారుడు ఉన్నారు. హరి గ్రోవర్ ఎలాంటి వీలునామా రాయకుండానే మరణించడంతో ఆస్తుల పంపకాల బాధ్యత ఆయన కుమారుడు సన్నీపై పడింది. తండ్రి మరణం తర్వాత ఆస్తుల నిర్వాహకుడిగా బాధ్యతలు చేపట్టిన సన్నీ.. తొలుత సుమారు 8.65 లక్షల పౌండ్ల (రూ.10 కోట్లకు పైగా) ఆస్తి ఉన్నట్లు లెక్కలు చూపించాడు. ఇందులో ప్రధానంగా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ ప్రాంతంలో ఉన్న ఇంటి విలువను పరిగణనలోకి తీసుకున్నాడు. అయితే ఈ లెక్కలపై ముగ్గురు అక్కా చెల్లెళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ తండ్రి ఆస్తుల విలువ ఇంగ్లండ్‌లోనే సుమారు 11.5 లక్షల పౌండ్లు (రూ.13 కోట్లకు పైగా) ఉంటుందని వాదించారు. అంతేకాదు.. తండ్రి సంపాదించిన నగదు, బంగారం వంటి విలువైన ఆస్తులను సోదరుడు లెక్కల్లో చూపించలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం లండన్‌లోని మేయర్ అండ్ సిటీ కౌంటీ కోర్టుకు చేరింది.

రూ.3 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ నాదే.. సోదరుడి వాదన!

ఈ కేసులో అసలు ట్విస్ట్ సుమారు 3 లక్షల పౌండ్ల (దాదాపు రూ.3.5 కోట్లు) బ్యాంకు పొదుపు ఖాతా దగ్గర మొదలైంది. ఈ డబ్బు తమ తండ్రి జీవితకాలం కష్టపడి సంపాదించిన పొదుపు సొమ్ము అని కుమార్తెలు వాదించారు. కానీ సన్నీ మాత్రం ఆ డబ్బుపై తనకే హక్కు ఉందని చెప్పాడు. ఎనిమిదేళ్ల క్రితమే తన తండ్రి బ్యాంకు ఖాతాలో తన పేరును జాయింట్ హోల్డర్‌గా చేర్చారని, తాను కూడా కొంత డబ్బు అందులో జమ చేశానని, తండ్రి మరణించిన తర్వాత ఆ మొత్తం తనకే చెందుతుందని వాదించాడు. బ్యాంకు సిబ్బంది కూడా ఆ నగదు వారసత్వ ఆస్తిలో భాగం కాదని చెప్పినట్లు కోర్టుకు వివరించాడు. అయితే న్యాయమూర్తి నికోలస్ పార్ఫిట్ ఈ వాదనలను నమ్మలేదు.

తండ్రి దుస్తుల మధ్య పాస్‌బుక్.. కొడుకు వాదనకు చెక్!

ఈ కేసులో ఓ చిన్న ఆధారం కీలకంగా మారింది. హరి గ్రోవర్ తన బ్యాంకు పాస్‌బుక్‌ను కుమారుడికి ఇవ్వకుండా తన దుస్తుల మధ్య దాచి పెట్టేవారని విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. సన్నీ తన సొంత డబ్బును ఆ ఖాతాలో జమ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తండ్రి ఈ ఖాతాను తన దగ్గరే ఉంచుకున్నట్లు ఇది సూచిస్తోంది. సన్నీని ఇందులో భాగస్వామిగా చేసుకున్నట్లు నాకు అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు ఏం చెప్పారన్నది కాకుండా, అసలు డబ్బుపై హక్కు ఎవరికి ఉందో నిర్ణయించేది కోర్టు అని స్పష్టం చేశారు. చివరకు ఆ రూ. 3 కోట్లకు పైగా క్యాష్‌ తండ్రి వారసత్వ ఆస్తిలో భాగమేనని తీర్పు ఇచ్చారు. దీంతో సోదరుడి వాదనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

భారత్‌లో రూ.5 కోట్ల బంగారం.. తండ్రి తనకే ఇచ్చాడన్న కొడుకు!

ఇక ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం భారత్‌లో దాచిన బంగారం. హరి గ్రోవర్‌కు చెందిన బంగారు కడ్డీలు, ఆభరణాలు కలిపి సుమారు 5 లక్షల పౌండ్ల (దాదాపు రూ.5.8 కోట్లు) విలువైన సంపద భారత్‌లోని ఓ సేఫ్‌ డిపాజిట్ బాక్స్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఈ బంగారంపై కూడా సన్నీ తనకే హక్కు ఉందని వాదించాడు. 2017లోనే తన తండ్రి ఆ బంగారాన్ని, లాకర్‌ను తనకు బహుమతిగా ఇచ్చేశారని చెప్పాడు. అయితే అక్కా చెల్లెళ్లు మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ బంగారం మొత్తం కుటుంబానికి చెందిందని, అందులో తమకు ఇవ్వాల్సిన ప్రత్యేక ఆభరణాలు కూడా ఉన్నాయని తెలిపారు. తండ్రి తమతో మాట్లాడిన సందర్భంలో ఆస్తులన్నింటినీ సమానంగా పంచుతానని హామీ ఇచ్చారని కోర్టుకు వివరించారు.

‘మీ సోదరుడిని నమ్మండి.. అందరికీ సమానంగా పంచుతాడు’

తండ్రి మరణానికి ముందు తమతో చెప్పిన మాటలను అక్కాచెల్లెళ్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ‘ఆందోళన చెందకండి.. మీ సోదరుడిని నమ్మండి. అతడు అన్నింటినీ సమానంగా పంచుతాడు’ అని హరి గ్రోవర్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. 2017లో సన్నీ లాకర్ బాధ్యతలు తీసుకున్న సమయంలో అందులో ఉన్న బంగారం, నగల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఆ విలువైన వస్తువులను సన్నీ, అతడి భార్య కుటుంబం తరఫున భద్రపరిచే బాధ్యతలో ఉన్నారని తీర్పులో పేర్కొన్నారు.

న్యాయమూర్తి ఆగ్రహం.. సోదరుడికి రూ.94 లక్షల ఖర్చు!

విచారణ సమయంలో సన్నీ వ్యవహరించిన తీరుపైనా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సాక్షిగా ప్రశ్నలు ఎదుర్కొంటున్నప్పుడు అతడు పదేపదే వాదనలకు దిగుతున్నాడని వ్యాఖ్యానించారు. కోర్టు వ్యక్తిగత గొడవలను పరిష్కరించే వేదిక కాదని, ఆధారాలు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తండ్రి ఆస్తుల నిర్వహణలో మిగతా విషయాల్లో సన్నీ బాగానే పనిచేశాడని వివాదాస్పద నగదు, బంగారం విషయంలో అతడి వాదనలను మాత్రం తిరస్కరించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఈ కేసు కోసం ఖర్చు చేసిన సుమారు 80 వేల పౌండ్ల (దాదాపు రూ.94 లక్షలు) న్యాయపరమైన ఖర్చును సన్నీ తన వాటా నుంచి చెల్లించాలని ఆదేశించారు.

ఆరు నెలల గడువు.. ఇక ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం లేదు!

సన్నీని ఆస్తుల నిర్వాహక బాధ్యతల నుంచి వెంటనే తొలగించాలని అక్కా చెల్లెళ్లు కోరినప్పటికీ న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయడానికి అతడికి మరో ఆరు నెలల గడువు ఇచ్చారు. అయితే ఈ సమయంలో అక్కా చెల్లెళ్లకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లోని బంగారం పంపకాల విషయంలోనూ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చివరగా నలుగురు తోబుట్టువులను ఉద్దేశించి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ‘పెద్దవాళ్లలా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించుకోండి’ అంటూ హితవు పలికారు.

Loading...
Unable to load recommendations.
Follow Us