సాధారణంగా ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండటం సాధారణమే. పెద్ద కుటుంబంలో అయితే ఆ సంఖ్య మహా అయితే ఆరు వరకు ఉంటుంది. అప్పటికే అంత మంది పిల్లల్ని జన్మనిచ్చి, వారిని సరిగ్గా పెంచాలంటేనే తలప్రాణం తోకకొస్తుంది. వారు చేసే అల్లరినీ భరించలేం. కాగా.. ఓ మహిళ 44 మంది పిల్లకు జన్మనిస్తే.. ఓరి దేవుడా.. ఇదేం వార్తరా బాబు అనుకుంటున్నారా.. అవునండి.. ఆఫ్రికాకు(Africa) చెందిన ఓ మహిళ 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతమంది పిల్లలకు తల్లి అయినా ఆమె వయసు ఎంతంటే కేవలం 40 మాత్రమే. ఆఫ్రికా లోని ఉగాండా(Uganda) దేశానికి చెందిన నబటాంజీ అనే మహిళ నివాసముంటోంది. ఆమెకు 12 సంవత్సరాల వయస్సున్నప్పుడే పెళ్లి అయింది. కాగా ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఓ అరుదైన వైద్య పరిస్థితి కారణంగా ఒక్కో కాన్పులో నలుగురైదుగురు చొప్పున జన్మనిచ్చింది. ఇలా ఇప్పటివరకు 44 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. ఆమెకు 44 మంది పిల్లలు కలిగినప్పుడు ఆమె వయసు 40 మాత్రమే. ఆమె జన్మనిచ్చిన 44మంది పిల్లల్లో ఆరుగురు పిల్లలు అనారోగ్యం కారణంగా చనిపోయారు.
అయితే ఒక్కో కాన్పులో సుమారు 2, 3, 4 పిల్లలకు జన్మనిస్తున్న సమయంలో ఆమె తీవ్ర భయానికి గురైంది. డాక్టర్ దగ్టరికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నబటాంజీ ఓ విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి ఎదుర్కొంటోందని, తద్వారా ఆమె చాలాసార్లు తల్లి అయినట్లు డాక్టర్ల నిర్ధారించారు. ఇతర మహిళలతో పోలిస్తే ఆమె అండాశయం పెద్దదిగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. గర్భనిరోధక పద్ధతులు ఆమెకు పని చేయవని వైద్యులు తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె 44 మందికి జన్మనిచ్చింది.