అందమైన అమ్మాయి.. రూ.8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం.. ఆ దేశ ఆర్మీ చీఫ్ వింత కోరిక..

ప్రపంచ దౌత్య చరిత్రలో ఇలాంటి వింత కోరికను ఎవరూ విని ఉండరు.. ఒక దేశ సైన్యాధిపతి.. మరో అగ్రదేశానికి అల్టిమేటం ఇచ్చారు. ఏమని అంటే.. నాకు బిలియన్ డాలర్ల డబ్బుతో పాటు దేశంలోని అందగత్తెను భార్యగా పంపండి అని.. వినడానికి సినిమా డైలాగ్‌లా ఉన్నా, ఉగాండా సైన్యాధిపతి టర్కీకి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

అందమైన అమ్మాయి.. రూ.8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం.. ఆ దేశ ఆర్మీ చీఫ్ వింత కోరిక..
Uganda Army Chief Muhoozi Kainerugaba

Updated on: Apr 13, 2026 | 11:29 AM

అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఎన్నడూ వినని రీతిలో ఉగాండా సైన్యాధిపతి ముహూజీ కైనెరుగాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ దేశం తనకు 30 రోజుల్లోగా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) చెల్లించాలని, దాంతో పాటు ఆ దేశంలోని అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా పంపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో టర్కీతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని ఆయన హెచ్చరించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడైన కైనెరుగాబా ఈ వివాదాస్పద వ్యాఖ్యలను X వేదికగా పంచుకున్నారు. అయితే తీవ్ర దుమారం రేగడంతో ఆ పోస్టులను కొద్దిసేపటికే తొలగించారు.

సోమాలియాలో ఉగాండా దళాలు గత 20 ఏళ్లుగా అల్-షబాబ్ ఉగ్రవాదులతో పోరాడుతుంటే, టర్కీ మాత్రం అక్కడ మౌలిక సదుపాయాలు, ఓడరేవుల ప్రాజెక్టుల ద్వారా లాభాలు గడిస్తోందని ఆయన ఆరోపించారు. ఆ పోరాటానికి ప్రతిఫలంగానే టర్కీ తనకు భారీ మొత్తంలో డబ్బు, అందమైన భార్యను ఇవ్వాలని ఆయన వాదించారు. ఇలా చేస్తేనే ఇరు దేశాల మధ్య శాంతి ఉంటుందని సెలవిచ్చారు. తన డిమాండ్లు నెరవేరకపోతే ఉగాండా రాజధాని కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని కైనెరుగాబా హెచ్చరించారు. అంతేకాకుండా ఏడాదిలోగా తాను ఇస్తాంబుల్‌లో పర్యటిస్తానని, అక్కడ తనకు వీరోచిత స్వాగతం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం గమనార్హం.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కైనెరుగాబా

ముహూజీ కైనెరుగాబా ఇలాంటి వింత ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంటర్నేషనల్ లెవల్లో పెను దుమారాన్ని రేపాయి. 2022లో ఉగాండా సైన్యం కేవలం రెండు వారాల్లో కెన్యా రాజధాని నైరోబీని స్వాధీనం చేసుకోగలదని ట్వీట్ చేశారు. దీనివల్ల ఉగాండా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురించి కూడా గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ పక్క సైన్యాధిపతిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మరోపక్క దేశాధ్యక్షుడి కుమారుడై ఉండి ఇలాంటి వింత డిమాండ్లు చేయడంపై దౌత్యవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. టర్కీ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Follow Us