RUSSIA TO END WAR: యుద్దాన్ని విరమించనున్న రష్యా.. ముహూర్తం ఖరారు చేసిన పుతిన్.. ఈలోగా టార్గెట్ ఇదే!

| Edited By: Ram Naramaneni

Mar 25, 2022 | 7:31 PM

యుక్రెయిన్‌లో యుద్ధం ముగించాలని రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. జీ7, జీ20 కూటముల నుంచి కూడా రష్యాను బహిష్కరించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు రష్యా వేల సంఖ్యలో సైనికులతో పాటు భారీగా ఆయుధాలను కూడా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో...

RUSSIA TO END WAR: యుద్దాన్ని విరమించనున్న రష్యా.. ముహూర్తం ఖరారు చేసిన పుతిన్.. ఈలోగా టార్గెట్ ఇదే!
Russia-Ukraine Conflict
Follow us on

RUSSIA TO END WAR WITH UKRAINE VERY SOON PUTIN FIXED A DATE: రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి అంతమెప్పుడు ? ఈ ప్రశ్నకు సమాధానం నేరుగా పుతిన్ కూడా ఇవ్వలేడేమో. ఓవైపు దేశంలో యుద్దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పెరిగిపోతున్నా.. తన ఆంతరంగిక బృందంలోని పలువురు పుతిన్ యుద్ద కాంక్షకు వ్యతిరేకంగా ఆయనకు దూరమవుతున్నా.. పుతిన్ యుద్దానికి ముగింపు పలికే దిశగా సమాలోచనలు చేయడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు రాస్తోంది. పలు దేశాలు విధించిన ఆంక్షలొకవైపు.. నెల రోజుల యుద్దంతో తలెత్తిన సంక్షోభం మరోవైపు కొనసాగుతున్న పుతిన్(Putin) వెనుకంజ వేయడం లేదు ప్రస్తుతానికి. ఇంకోవైపు తమ శక్తికి మించి పోరాడుతున్న యుక్రెయిన్ మరిన్ని ఆయుధాల కోసం అమెరికా( America)ను, యూరోపియన్ దేశాలను అడుక్కుంటోంది. అదేసమయంలో యుద్దానికి ముగింపు పలికే దిశగా భారత్(India), చైనా(China), జర్మనీ(Germany) లాంటి దేశాలు చొరవ చూపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) తరచూ కోరుతున్నారు. దేశ రాజధానిని రష్యా దురాక్రమణ నుంచి రక్షించుకోవడమే కాకుండా ఆల్‌రెడీ రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను సైతం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుక్రెయిన్ మిలిటరీ ప్రయత్నిస్తోంది. అందుకోసం మరిన్ని ఆయుధాలు కావాలని, యాంటీ ట్యాంకర్ మిస్సైళ్ళు కావాలని పోలండ్(Poland), బ్రిటన్, అమెరికా దేశాలను కోరుతోంది. రష్యన్ల దాడులతో యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో విధ్వంసం జరిగిపోయింది. తొలుత ఖార్కీవ్.. ప్రస్తుతం పోర్ట్ సిటీ మరియుపోల్ వంటి నగరాలైతే ఒకట్రెండు దశాబ్ధాల పాటు పునర్నిర్మాణం చేసినా సాధారణ స్థాయికి చేరుకోలేవన్న స్థాయిలో దెబ్బతిన్నాయి. దేశ రాజధాని కీవ్, ఎల్వీవ్, జఫరోజియా, ఒడెస్సా వంటి నగరాలు కూడా చాలా మటుకు విధ్వంసానికి గురయ్యాయి. కీవ్ రాజధానికి సహజసిద్దంగా రక్షణగా వున్న నది కారణంగా రాజధానిలో 80 శాతం సేఫ్‌గా వుందని తెలుస్తోంది. అయితే.. అమెరికా తమకందించిన యాంటీ ట్యాంకర్ మిస్సైళ్ళతోనే కీవ్ నగరాన్ని యుక్రెయిన్ మిలిటరీ రక్షించుకోగలిగిందని తెలుస్తోంది.

ఇదిలా వుండగా.. ఫిబ్రవరి 24వ తేదీన యుక్రెయిన్ మిలిటరీ దాడులను ప్రారంభించిన రష్యా కూడా నెల రోజుల తర్వాత కూడా తామనుకున్నది సాధించలేకపోతోంది. దాంతో తూర్పు యుక్రెయిన్ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు రచించిన ప్లాన్ బీని అమలు చేస్తోంది. బ్లాక్ సీలోకి చొచ్చుకుపోయినట్లున్న క్రిమియాపై దాదాపు ఎనిమిదేళ్ళుగా ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన రష్యా.. అక్కడ్నించి ఈశాన్య యుక్రెయిన్‌లోని డాన్ బాస్ వరకు వున్న ప్రాంతాన్ని యుక్రెయిన్ నుంచి విముక్తం చేయాలని చూస్తోంది రష్యా. అందుకే గత వారం, పది రోజులుగా ఆగ్నేయ యుక్రెయిన్ ఏరియాలో వున్న సముద్ర తీర నగరం మరియుపోల్‌ని విధ్వంసం చేస్తోంది. ఆ నగరం గనక వశమైతే.. క్రిమియా నుంచి ఈశాన్య యుక్రెయిన్‌లోని డాన్ బాస్ వరకు వున్న ఏరియా రష్యా ఆధీనంలోకి వెళుతోంది. ఆ తర్వాత ఆ ఏరియాకు స్వతంత్రం ప్రకటిస్తూ.. దాన్ని గుర్తించాలంటూ యుక్రెయిన్ ప్రభుత్వం ముందు షరతు విధించే యోచనలో రష్యా వున్నట్లు తెలుస్తోంది. ఈ షరతు అంగీకరించడంతోపాటు.. నాటో సభ్యత్వ ప్రయత్నాలను శాశ్వతంగా వదిలేస్తేనే సైనిక దాడులను ఆపాలని పుతిన్ భావిస్తున్నట్లు రష్యన్ మీడియా అంచనా వేస్తోంది.

ఇంకోవైపు యుక్రెయిన్‌పై రష్యా సేనలు పలు చోట్ల విరుచుకుపడుతున్నాయి. కీవ్‌, ఖార్కీవ్‌, మరియుపోల్‌లో క్షిపణులు, బాంబు దాడులు చేస్తున్నాయి. మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై జరిపిన బాంబు దాడిలో 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. యుక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని వార్తా కథనాలు వచ్చాయి. మరియుపోల్‌లోని ఓ డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. నెలరోజులుగా యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా బలగాల షెల్లింగ్‌ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కంధర్‌ మిస్సైల్స్‌ను తాజాగా ప్రయోగించింది రష్యా. నాటో వార్నింగ్‌ను లైట్‌గా తీసుకున్న పుతిన్‌ దాడులను రెట్టింపు చేయాలని రష్యా సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియో పేర్కొంది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పోలండ్ పర్యటన ఆసక్తికరంగా మారింది. యుక్రెయిన్‌ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలండ్‌ సిటీకి చేరుకున్నాడు బైడెన్‌. ఈ పర్యటన రష్యాను మరింత ఆగ్రహానికి గురి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమను కవ్విస్తే అణుయుద్ధం తప్పదని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యూరప్‌ పర్యటన మరింత హీట్‌ పుట్టిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదముందా అన్న టెన్షన్‌ నెలకొంది. రష్యా అణు యుద్ధం బెదిరింపులతో..యుక్రెయిన్‌కు మద్దతుగా నాటో దళాలను మోహరించారు. తూర్పు భాగానికి 40 వేల మంది నాటో సైనికులు చేరుకున్నారు. రష్యా బలగాలకు తోడుగా చెచెన్‌ ఫైటర్స్‌ కూడా పలు నగరాల్లో యుక్రెయిన్‌ సైన్యంపై దాడులు చేస్తున్నారు. మరియుపోల్‌లో ఓ బిల్డింగ్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులపై చెచెన్‌ ఫైటర్స్‌ మెరుపుదాడి చేశారు.

ఇప్పటిదాకా ఒక ఎత్తు..ఇక నుంచి మరో ఎత్తు..ఎస్‌..యుక్రెయిన్‌-రష్యా యుద్దం మొదలై నెల పూర్తయింది. అయితే ఇప్పటివరకు రష్యా పెద్దగా సాధించిందేమీ లేదు. ఈ పరిస్థితుల్లో మరింత ఉక్రోషంతో విచ్చలవిడిగా భీకర దాడులు చేస్తోంది. సూపర్‌ పవర్‌ఫుల్‌ బాంబులతో విరుచుకుపడుతోంది. అదేసమయంలో రష్యా సేనల్ని యుక్రెయిన్‌ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 16 వేల 100 మందికి పైగా రష్యన్ సైనికుల్ని మట్టుబెట్టినట్టు యుక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో పాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ప్రకటించుకుంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అత్యంత భయంకర, దయనీయ పరిస్థితి నెలకొంది. కీవ్‌పై పట్టుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది రష్యా. నెల రోజులుగా అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నా..కీవ్‌ను చేజిక్కించుకోలేకపోయింది. రష్యన్‌ దళాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది యుక్రెయిన్‌ ఆర్మీ. ఆ ఉక్రోషంతో పాటు పశ్చిమ దేశాలు జెలెన్‌స్కీ సేనకు సాయం చేస్తున్నాయని రగిలిపోతున్న రష్యా..దాడులను మరింత ముమ్మరం చేసింది. కీవ్ నగరాన్ని వీడుతున్న శరణార్థుల ట్రైన్‌ పైనా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్‌గా కీవ్ నుంచి ఇవనో ఫ్రాంక్విస్క్ నగరానికి వెళ్తున్న రైలుపై దాడి చేశాయి. ఈ ఘటనలో 3 బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే రైలు లోకో పైలట్ సాహసోపేతంగా ముందుకు తీసుకెళ్లి..షెల్లింగ్ నుంచి బయటపడేశాడు.

ఇంకోవైపు యుక్రెయిన్‌లో యుద్ధం ముగించాలని రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. జీ7, జీ20 కూటముల నుంచి కూడా రష్యాను బహిష్కరించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు రష్యా వేల సంఖ్యలో సైనికులతో పాటు భారీగా ఆయుధాలను కూడా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌పై వార్‌కు ముగింపు పలికేందుకు రష్యా సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మే 9న యుద్ధాన్ని ముగించే అవకాశమున్నట్టు యుక్రెయిన్‌ ఆర్మీ అంచనా వేస్తోంది. నాజీ జర్మనీపై విజయం సాధించిన రోజుగా రష్యాలో మే 9న విజయోత్సవ్‌ జరుపుకుంటారు. ఆ రోజునాటికి యుద్ధం ముగియాలని రష్యన్‌ బలగాలకు అధ్యక్షుడి నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఈలోగా టార్గెట్‌ పూర్తి చేయాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.