
కాలాంతకురాలైన కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో చెడుగుడులాడుతోంది.. జన జీవితాలను కట్టిపడేస్తోంది.. అర్ధాకలితో అలమటించేలా చేస్తోంది.. ఆటలనే నమ్ముకుని, ఆ ఆటలతోనే ఇంతకాలం జీవితాలను నెట్టుకుని వచ్చినవారి పరిస్థితి అయితే దారుణంగా తయారయ్యింది.. నిన్ననే నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ విషాదగాధను తెలుసుకున్నాం.. పాపం ఆ 28 ఏళ్ల క్రికెటర్ ఇప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారాల్సి వచ్చింది.. వెనిజులాకు చెందిన ఒలింపియన్ కూడా ఇదే కష్టాలు పడుతున్నాడు.. వెనిజులా చాలా చిన్నదేశం.. ఆ దేశం నుంచి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించింది ఇద్దరే ఇద్దరు.. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ బంగారు పతకాన్ని సాధిస్తే 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాకారులు రూబెన్ లిమార్డో గాస్కన్ గోల్డ్ కొట్టాడు.. గోల్డ్ మెడల్ సాధించాడు కదా అని ఆ దేశం అతడిని నెత్తినెక్కించుకోలేదు.. కోట్లాది రూపాయలు, ఖరీదైన ప్లాట్ ఇవ్వలేదు.. అలాగని లిమార్డో ఆకలితో ఆలమటించలేదు.. ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు.. 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించలేకపోయాడు.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలలో రెండు సిల్వర్ మెడల్స్ గెల్చుకున్న లిమార్డో ప్రస్తుతం పోలాండ్‌లో ట్రయినింగ్ తీసుకుంటున్నాడు.. మొన్నటివరకు స్పాన్సర్‌షిప్ నుంచి డబ్బు వచ్చేది.. ఇప్పుడు కరోనా కారణంగా స్పాన్సర్లు కూడా వెనక్కిపోయారు.. మరోవైపు టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి.. అంతకాలం తాము భరించలేమంటూ స్పాన్సర్లు తేల్చి చెప్పారు.. భార్య, ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత లిమార్డోపైనే ఉంది.. దాంతో పాటు ట్రయినింగ్‌కి కూడా డబ్బులు కావాలి.. 35 ఏళ్ల లిమార్డో ఇప్పుడు చాలా కష్టపడుతున్నాడు.. ఇంతకాలం ఫెన్సింగే సర్వస్వంగా భావించిన లిమార్డో ఇప్పుడు ఉబెర్ ఈట్స్ డెలివరీ బాయ్‌గా మారాడు. ఉదయం కాసేపు ప్రాక్టీస్ చేసి తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు వెళుతున్నాడు.. సాయంత్రం మళ్లీ కాసేపు సాధన చేస్తున్నాడు.. డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నందుకు నామోషీ ఏమీ లేదని, కరోనా కాలంలో ఏదో ఒక పని దొరికినందుకు ఆనందంగా ఉందని అంటున్నాడు. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే తన లక్ష్యమని, అందుకోసం ఎంతైనా శ్రమిస్తానని అంటున్నాడు ఫెన్సింగ్ వీరుడు..