
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇజ్రాయెల్ గడ్డపై మోదీ చేసిన ప్రసంగం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఇజ్రాయెల్ – భారత్ బంధం ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చిన చెక్కుచెదరనిది అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. తనకు లభించిన అత్యున్నత స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ గురించి ప్రస్తావిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పురస్కారం నా ఒక్కడిది కాదు.. ఇది 140 కోట్ల భారతీయుల గౌరవానికి చిహ్నం. దీనిని భారతదేశం-ఇజ్రాయెల్ స్నేహానికి అంకితం చేస్తున్నాను’’ అని ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాల రంగంలో ఇరు దేశాలు గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతాయని మోదీ ఆకాంక్షించారు. పౌర అణుశక్తి, అంతరిక్ష పరిశోధన రంగాలలో రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. రక్షణ సంబంధాలు కేవలం కొనుగోలు, అమ్మకాలకు పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు.
భారతదేశ డిజిటల్ విప్లవ చిహ్నమైన UPI ఇకపై ఇజ్రాయెల్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఫిన్‌టెక్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి కుదిరిన ఈ ఒప్పందాన్ని మోదీ స్వాగతించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
భవిష్యత్తు సాంకేతికతదే అని నమ్మే మోదీ.. ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక సాంకేతికతను భారతదేశంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం వ్యవసాయం, నీటి సంరక్షణలో ప్రపంచంలోనే నంబర్ 1. ఇప్పుడు ఆ టెక్నాలజీని మన దేశంలోని ప్రతి గ్రామానికి తీసుకురావాలని మోదీ నిర్ణయించారు. దీనివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది మరియు స్మార్ట్ గ్రామాలు తయారవుతాయి.
శాంతికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెబుతూనే, ఉగ్రవాదంపై మోదీ గట్టిగా స్పందించారు. ‘‘ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. దీనికి వ్యతిరేకంగా భారత్, ఇజ్రాయెల్ కలిసి పోరాడతాయి’’ అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, గాజా శాంతి ప్రక్రియ అందరి శ్రేయస్సు కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ చేసిన ప్రసంగం ఇజ్రాయెల్ ప్రజల గుండెలను హత్తుకుందని, అది విన్నప్పుడు ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రెస్ మీట్ మధ్యలో నెతన్యాహు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “నేను నా భార్య సారాను మొదటిసారి కలిసినప్పుడు, మా మొదటి లేదా రెండవ డేటింగ్ టెల్ అవీవ్‌లోని ఒక ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగింది. అప్పుడే ఆమెకు భారతీయ ఆహారం పరిచయం అయ్యింది. ఆ డేట్ మాకు చాలా ప్రత్యేకం” అంటూ భారతదేశంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.