చాట్ జీపీటీ-6 అస్త్ర విడుదల..ఇది మనం ఊహించుకున్నంత స్మార్టేనా..?

GPT 6 Astra Launch:  ఓపెన్‌ఏఐ సంస్థ మరో అద్భుతమైన ఏఐ మోడల్‌ను తీసుకొచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా జీపీటీ-6 ‘అస్త్ర’ (Astra)ను విడుదల చేసింది. తాము ఇప్పటివరకు రూపొందించిన వాటిలో ఇదే అత్యంత శక్తివంతమైన ఏఐ అని సంస్థ తెలిపింది. కంప్యూటర్ వాడకం, ఆఫీస్ పనులు, సైన్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి వివిధ రంగాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.  

చాట్ జీపీటీ-6 అస్త్ర విడుదల..ఇది మనం ఊహించుకున్నంత స్మార్టేనా..?
Openai Launches 'world's Most Intelligent' Ai Model Gpt 6 Astra

Updated on: Sep 05, 2026 | 3:07 PM

‘అస్త్ర’ విడుదలతో కొత్త తరం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత ఊతం లభిస్తుందని ఆల్ట్‌మన్‌ అన్నారు. ప్రస్తుతం మనం ఏజీఐ యుగంలోకి ప్రవేశించామని భావించడం అసంబద్ధం కాదని ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏఐ చరిత్రను తిరిగి చూసినప్పుడు ‘అస్త్ర’ విడుదల కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందన్నారు.

కోడింగ్‌లో ‘అస్త్ర’ పనితీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఓపెన్‌ఏఐ నిర్వహించిన పరీక్షల ప్రకారం.. ఇది జీపీటీ-5.6 సోల్ (Sol)తో పాటు ఆంథ్రోపిక్ ఫేబుల్ (Anthropic Fable) మోడళ్లను కూడా వెనక్కి నెట్టింది. ‘అస్త్ర’ కేవలం ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాకుండా, ఎన్నో రకాల పనులను స్వయంగా చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూరించడం, క్యాలెండర్ ప్రకారం పనులను షెడ్యూల్ చేయడం, సమాచారం కోసం వెతకడం, శాస్త్రీయ సమాచారాన్ని విశ్లేషించడం, సొంతంగా వెబ్‌సైట్లు రూపొందించడం, సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి పరిశీలించడం వంటివి చేస్తుంది.

అంతేకాకుండా, బ్లెండర్ (Blender) సాఫ్ట్‌వేర్‌లో త్రీడీ (3D) మోడళ్లను తయారు చేయడం, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడం వంటి పనులను కూడా ఇది చేయగలదని ఓపెన్‌ఏఐ నిరూపించింది. అంతేకాకుండా, లీగల్ డాక్యుమెంట్లు , ట్యాక్స్ రిటర్న్స్ తయారీని సమర్థవంతంగా చేస్తుంది. సైబర్‌ సెక్యూరిటీ విషయంలోనూ ‘అస్త్ర’ పనితీరు అద్భుతంగా ఉందని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఎలాంటి భద్రతా ఆంక్షలు లేకుండా నిర్వహించిన పరీక్షల్లో ఇది ‘ఎక్స్‌ప్లాయిట్‌ బెంచ్‌’ పై ఏకంగా 100 శాతం స్కోర్‌ సాధించి రికార్డు సృష్టించింది. ఇదే పరీక్షలో గత మోడలైన జీపీటీ-5.6 సోల్ కేవలం 78.5 శాతం మాత్రమే సాధించగలిగాయి. అయితే, ఇంతటి అత్యుత్తమ సామర్థ్యాల వల్ల భద్రతాపరమైన ముప్పులు లేదా దుర్వినియోగం జరిగే అవకాశం ఉండటంతో.. ‘అస్త్ర’ మోడల్‌పై ఓపెన్‌ఏఐ సంస్థ కఠినమైన నియంత్రణలను, భద్రతా ప్రమాణాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ‘అస్త్ర’ను డేబ్రేక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్ వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు. వచ్చే వారం నుంచి పెయిడ్ (చెల్లింపు) చాట్‌జీపీటీ ప్లాన్లను వాడే యూజర్లకు ఇది దశలవారీగా అందుబాటులోకి రానుంది. దీనిని కేవలం చాట్‌జీపీటీలోనే కాకుండా, ఓపెన్‌ఏఐ ఏపీఐ (API), ఏడబ్ల్యూఎస్‌ (AWS), అలాగే అమెజాన్‌ బెడ్‌రాక్‌ (Amazon Bedrock) వేదికగా కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఈ మోడల్ విడుదల ఆలస్యం కావడంపై ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ వినియోగదారులకు క్షమాపణలు తెలిపారు. ముందుగా ప్రో (Pro) యూజర్లకు దీనిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us