Giorgia Meloni posting rape video: ఎన్నికల్లో గెలవడానికి కొందరు ఎంతకైనా తెగిస్తారు.. అవసరమైతే కుటుంబాన్నే కాదు.. ఏదైనా నీచ పని చేయడానికి కూడా వెనకాడరు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటలీ దేశంలో చోటుచేసుకుంది. అది చేసింది ఎవరో గల్లీ నేత కాదు.. ఏకంగా ప్రధాని అభ్యర్థే నీచమైన పనికి దిగారు. ఇటలీ ప్రధాని రేసులో ఉన్న జార్జియా మెలోని (45) ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురైన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రెండు రోజుల అనంతరం ట్విట్టర్ ఎట్టకేలకు ఆ వీడియోను తొలగిస్తూ చర్యలు తీసుకుంది. కాగా, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇటలీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారులలో ఒకరైన జార్జియా మెలోని ఓ మహిళపై అత్యాచారం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, న్యాయం కోసం ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. జార్జియా మెలోని ఈ చర్యపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రజలు కూడా ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు.
జార్జియా మెలోని ఇటలీకి చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరు. రైట్‌వింగ్ అభ్యర్థిగా బలమైన పోటిదారురాలిగా బరిలో ఉన్నారు. అయితే.. అవకాశాలను మరింత బలం చేకూర్చుకునేందుకు ఆమె ఈ నీచమైన పని చేశారు. ఇటలీలో శరణార్థిగా జీవిస్తున్న 55 ఏళ్ల ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం జరిగిందని ఉత్తర ఇటాలియన్ నగరమైన పియాసెంజా స్థానిక అధికారులు తెలిపారు. అత్యాచార నిందితుడు నల్లజాతీయుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
ఈ వీడియోను మెలోని బ్లర్ చేయకుండా ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టపగలు మహిళలపై అత్యాచారం జరుగుతోందని, దీన్ని ఎలా సహించాలన్నారు. తాను ప్రధాని అయితే చట్టాన్ని మరింత కఠినతరం చేస్తానంటూ పేర్కొన్నారు. మెలోని ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే, ప్రత్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి మెలోని ఇలాంటి అసహ్యకరమైన వ్యూహాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ నీచమైన చర్యను ఇటలీ ప్రజలు క్షమించరంటూ మండిపడుతున్నారు.
రోమ్‌లో పుట్టి, పెరిగిన జార్జియా మెలోనీకి జర్నలిస్ట్‌గా, మానవ హక్కుల ఉద్యమకారిణిగా మంచి పేరుంది. సెప్టెంబర్ 25వ తేదీన జరగబోయే ఇటలీ జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరపున మెలోనీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..