
ఇజ్రాయెల్‌లోని జెరూసలేం శివార్లలో కార్చిచ్చు అంటుకుంది. కేవలం 24 గంటల్లోనే వేలాది మంది నివాసితులను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. ఒకవైపు కార్చిచ్చుతో మండిపోతున్న ఇజ్రాయెల్‌ను ఇసుక తుఫాన్ మరింత అతలాకుతలం చేస్తోంది. ఈ రెండు ప్రకృతి విపత్తులతో ఇజ్రాయెల్ దేశం చిగురుటాకులా వణికిపోతుంది. తమను అదుకోవాలంటూ ఇప్పటికే ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించింది. ఇజ్రాయెల్‌లో మరణించిన సైనికుల స్మారక దినోత్సవం నాడు ఈ భారీ కార్చిచ్చు అంటుకుంది. ప్రధాన రూట్ 1 జెరూసలేం నుండి టెల్ అవీవ్ హైవే వెంబడి మంటలు ఎగిసిపడుతున్నట్లు వీడియోలు బయటికి వచ్చాయి. చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ కమ్ముకుంటోంది. చాలా మంది తమ కార్లను వదిలి మంటలకు దూరంగా పారిపోతున్నట్లు వీడియోల్లో చూడొచ్చు.
ఈ కార్చిచ్చును ఆర్పేందుకు 160 కి పైగా రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు అగ్నిమాపక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి. డజన్ల కొద్దీ విమానాలు, హెలికాప్టర్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దేశ సైన్యం కూడా రెస్క్యూ కార్యకలాపాలకు సహాయం చేస్తోందని అధికారులు వెల్లడించారు. అయితే, పొడి వాతావరణ పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు ప్రమాదకరంగా వ్యాప్తిస్తోందని, ఇది సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇదే అతిపెద్దదిగా ప్రభుత్వం పేర్కొంది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాల్లో, అడవులలోకి ప్రజలను నిషేధించారు. మంటలు చెలరేగిన రూట్ 1తో సహా అనేక రోడ్లను ఇప్పటికే మూసివేశారు. గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మంటలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇజ్రాయెల్ వైమానిక దళం 18,000 లీటర్ల అగ్నిమాపక సామగ్రిని నిల్వ చేయగల C-130J సూపర్ హెర్క్యులస్ భారీ రవాణా విమానాలను రెస్క్యూ పనుల కోసం మోహరించినట్లు తెలుస్తోంది.
ఈ మంటల్లో ఇప్పటికే దాదాపు 3,000 ఎకరాల భూమి కాలిపోయినట్లు సమాచారం. మంటలను ఆర్పడానికి ఇటలీ, క్రొయేషియా మూడు అగ్నిమాపక విమానాలను పంపుతాయని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. సాయం కోసం గ్రీస్, సైప్రస్, బల్గేరియాలకు కూడా విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకవైపు కార్చిచ్చు భయపెడుతుంటే.. మరోవైపు ఇసుక తుఫాన్‌ను ఇజ్రాయెల్‌పై పగబట్టినట్లు ముంచుకొచ్చింది. బుధవారం ఇజ్రాయెల్‌ను తీవ్రమైన ఇసుక తుఫాను తాకింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారి, బీర్షెబాను చుట్టుముట్టిన భారీ ధూళి మేఘం ఆవరించింది. నెగెవ్‌లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరానికి ఇసుక తుఫాను చేరుకుందని స్థానిక మీడియా నివేదించింది.
INSANE sandstorm sweeps southern Israel, West Bank amidst raging wildfire crisis pic.twitter.com/QPDIgw3hft
— RT (@RT_com) May 1, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి