
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ ప్రభుత్వం తమ పౌరులకు అనూహ్యమైన, అత్యంత అరుదైన హెచ్చరికను జారీ చేసింది. అణు దాడి లేదా అణు విస్ఫోటనం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి? ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి? అనే కీలక అంశాలపై అధికారులు విస్తృత స్థాయి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఐఆర్ఎన్ఏ’ (IRNA) ఈ మేరకు సుమారు ఎనిమిది నిమిషాల నిడివితో కూడిన ప్రత్యేక అవగాహన వీడియోను ప్రసారం చేసింది. రేడియోధార్మిక ధూళి (న్యూక్లియర్ ఫాల్‌అవుట్) నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో క్షుణ్ణంగా వివరించింది.
ఇరాన్‌లోని కీలకమైన నతాంజ్ అణు కేంద్రాన్ని కలిగి ఉన్న ఇస్ఫాహన్ అత్యవసర సేవల విభాగం ఈ సూచనలను జారీ చేసింది. ఇరాన్‌లోని భూగర్భ పికాక్స్ మౌంటెన్ అణు కేంద్రంపై అమెరికా దాడి చేయవచ్చన్న అంతర్జాతీయ ఊహాగానాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరులను సంక్షోభ పరిస్థితులకు సిద్ధం చేసేందుకు ఏటా నిర్వహించే ‘పాసివ్ డిఫెన్స్ వీక్’లో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అణు దాడి జరిగిన సమయంలో విపరీతమైన కాంతి, పేలుడు ధాటికి వచ్చే బలమైన తరంగాలు, విపరీతమైన వేడి, ప్రమాదకరమైన రేడియోధార్మికత అతిపెద్ద సవాళ్లుగా మారతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో పౌరులు పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు.
భవనాల లోపలే తలదాచుకోవాలి: ధృడమైన భవనాల్లోని బేస్‌మెంట్లు లేదా కిటికీలు లేని మధ్య భాగపు గదుల్లో ఆశ్రయం పొందాలి. బయటి గాలి లోపలికి లాగే ఎయిర్ కండీషనర్లను వెంటనే ఆపివేయాలి.
కనీసం 24 గంటలు బయటకు రావద్దు: పేలుడు కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రాంతాలకు సైతం గాలి ద్వారా రేడియోధార్మిక రేణువులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, కనీసం 24 గంటల పాటు ఆశ్రయం పొందిన భవనాల నుంచి బయటకు రాకూడదు.
వాహనాలు రక్షణనివ్వవు: కార్లు లేదా ఇతర వాహనాలు అణు ధూళి నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేవని, వాహనాల్లో తలదాచుకోకూడదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్యాక్ చేసిన ఆహారం, బాటిల్ వాటర్ మాత్రమే తీసుకోవాలని సూచించారు.
బయట ఉన్నప్పుడు విస్ఫోటనం జరిగితే?: అణు పేలుడు వైపు కళ్లతో నేరుగా చూడకూడదు. వెంటనే నేలపై పడుకుని ముఖం, తలను రక్షించుకోవాలి. అనంతరం వీలైనంత త్వరగా పక్కనే ఉన్న గట్టి భవనాల్లోకి చేరాలి.
దుస్తులు, శరీర శుభ్రత: రేడియోధార్మిక ధూళి బారిన పడినట్లు అనుమానం ఉంటే.. ఆ దుస్తులను జాగ్రత్తగా విప్పి సంచుల్లో సీల్ చేయాలి. బహిర్గతమైన చర్మం, వెంట్రుకలను శుభ్రంగా కడుక్కోవాలి.
వైద్య సలహా లేకుండా మాత్రలు వద్దు: వైద్యుల సిఫార్సు లేకుండా సొంత నిర్ణయాలతో అయోడిన్ మాత్రలు తీసుకోకూడదని అధికారులు హెచ్చరించారు. సమాచార వ్యవస్థలు స్తంభించిపోతే అత్యవసర అప్‌డేట్స్ తెలుసుకునేందుకు బ్యాటరీతో పనిచేసే రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.