Hormuz Strait: హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ట్రాన్సిట్ టోల్ విధించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే నావిగేషన్, పర్యావరణ పరిరక్షణ, బీమా, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు కొనసాగుతాయని వెల్లడించింది. అమెరికాతో ఒప్పందం కుదిరినా పూర్తి స్థాయిలో విశ్వాసం లేదని ఇరాన్ పేర్కొంది.

Hormuz Strait: హర్మూజ్‌పై కొత్త మెలిక పెట్టిన ఇరాన్.. టోల్ ఛార్జీలు లేవంటూనే..
Hormuz Strait

Updated on: Jun 16, 2026 | 1:08 PM

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఎలాంటి ట్రాన్సిట్ టోల్ విధించబోమని స్పష్టం చేసినప్పటికీ, సముద్రయాన సేవలకు సంబంధించిన ఛార్జీలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్‌లో టోల్ ఉండదని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మీడియాతో మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి ట్రాన్సిట్ రుసుము వసూలు చేయబోమని పునరుద్ఘాటించారు. అయితే నావిగేషన్ సేవలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, నౌకలకు బీమా సదుపాయాలు, ఇతర సముద్ర భద్రతా సేవల కోసం నిర్దిష్ట ఛార్జీలు వసూలు చేయడం కొనసాగుతుందని తెలిపారు. అమెరికాతో యుద్ధ విరమణ లేదా ఇతర ఒప్పందాలు కుదిరినా, గత అనుభవాల దృష్ట్యా వాషింగ్టన్‌పై పూర్తి స్థాయి విశ్వాసం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్-అమెరికా సంబంధాల్లో ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని సూచిస్తున్నాయి.

అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం.. సహజంగా ఏర్పడిన జలసంధుల గుండా ప్రయాణించే నౌకలపై తీర దేశాలు ట్రాన్సిట్ ఫీజులు విధించలేవు. అయితే పైలటింగ్, టగ్గింగ్, పోర్టు సదుపాయాలు లేదా భద్రతా సేవలు అందించినప్పుడు పరిమిత స్థాయిలో రుసుములు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీజులు ఏ దేశాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఉండకూడదనే నిబంధన కూడా అమల్లో ఉంది. ఇక సూయజ్ కాలువ, పనామా కాలువ వంటి మానవ నిర్మిత కాలువల విషయంలో మాత్రం ఆయా దేశాలకు టోల్ వసూలు చేసే హక్కు ఉంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో కొత్త రుసుములు లేదా పరిమితులు అమలైతే అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు రవాణా వ్యయాలు పెరిగితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us