Afghanistan-India: తీవ్ర ఆహార సంక్షోభంలో ఆఫ్గన్‌ ప్రజలు.. పాక్‌ మీదుగా 2,500 టన్నుల గోధుమలను పంపిణీ చేసిన భారత్‌!

|

Feb 22, 2022 | 10:03 PM

తాలిబన్ల అరాచక పాలనలో ఆకలితో అలమటిస్తున్న ఆఫ్గనిస్తాన్‌కు సాయం చేసేందుకు మన దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. పాకిస్తాన్ మీదుగా 2,500 టన్నుల గోధుమలను మనదేశం నుంచి ఆఫ్గన్‌కు మంగళవారం (ఫిబ్రవరి 22) పంపిణీ చేసింది..

Afghanistan-India: తీవ్ర ఆహార సంక్షోభంలో ఆఫ్గన్‌ ప్రజలు.. పాక్‌ మీదుగా 2,500 టన్నుల గోధుమలను పంపిణీ చేసిన భారత్‌!
Wheat For Afghanistan
Follow us on

India despatches wheat for Afghanistan via Pak: తాలిబన్ల అరాచక పాలనలో ఆకలితో అలమటిస్తున్న ఆఫ్గనిస్తాన్‌కు సాయం చేసేందుకు మన దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. పాకిస్తాన్ మీదుగా 2,500 టన్నుల గోధుమలను మనదేశం నుంచి ఆఫ్గన్‌కు మంగళవారం (ఫిబ్రవరి 22) పంపిణీ చేసింది. కాగా ప్రపంచ ఆహార కార్యక్రమం (World Food Programme) ద్వారా మొత్తం 50,000 టన్నుల గోధుమలను సరఫరా చేస్తామని ఇచ్చిన మాట మేరకు మొదటి విడతగా ఈ రోజు 2,500 టన్నుల గోదుమలను లారీ ట్రక్కుల్లో పంపించింది. ఈ క్లిష్ట సమయంలో ఆఫ్గనిస్తాన్‌కు మద్దతుగా నిలిచి, అందించిన అతిపెద్ద ఆహార విరాళాలలో ఇది ఒకటి అని ఆఫ్గన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ (Afghan ambassador Farid Mamundzay) అన్నారు. నేడు అమృత్‌సర్‌లో జరిగిన ఒక వేడుకలో 50 ట్రక్కుల గోధుమలతో బయల్దేరిన కాన్వాయ్‌ను అఫ్గాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్, డబ్ల్యుఎఫ్‌పి కంట్రీ డైరెక్టర్ బిషో పరాజూలీలతో కలిసి విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నుంచి గోధుమలను ఆఫ్గనిస్తాన్‌కు పంపిణీ చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా దృక్పధంతో సాయం చేయాలని ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం గోధుమలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆఫ్గన్‌ ప్రజలకు 50,000 టన్నుల గోధుమల పంపిణీకి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

20 మిలియన్లకు పైగా ఆఫ్గన్‌ ప్రజలు దాదాపు3 దశాబ్దాలకు పైగా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారత దేశ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆఫ్గన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆఫ్గన్ ట్రక్కుల్లో మాత్రమే గోధుమలను తమ భూభాగం గుండా తరలించాలనే షరతుపై పాకిస్తాన్ ఈ ఆహార పంపిణీ కార్యక్రమానికి అంగీకారం తెల్పింది. కాగా మన దేశం నుంచి ఇప్పటికే 5,00,000 డోస్‌ల కోవ్యాగ్జిన్‌ వ్యాక్సిన్లు,13 టన్నుల మెడిసిన్‌, 500 యూనిట్ల శీతాకాలపు దుస్తులు సరఫరా చేసింది. విడతల వారీగా గోధుమలతోపాటు ఇతర సరుకులను కూడా ఆఫ్గన్‌కు మన దేశం నుంచి పంపిణీ చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెల్పింది.

Also Read:

SAI Jobs: నేరుగా ఇంటర్వ్యూతోనే..60 వేల జీతంతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..