భారత వృద్ధిరేటు 2021ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయంగా 11.5%గా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కరోనా వైరస్ ఇబ్బందుల్లోనూ రెండంకెల జీడీపీని నమోదు చేయగల ఏకైక దేశం ఇండియానేనని తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అప్‌డేట్‌లో ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తెలియజేశారు. కాగా, చైనా 8.1% జీడీపీని సాధించవచ్చన్న ఆమె ప్రపంచ వృద్ధిరేటు ఈసారి 5.5%గా ఉండొచ్చని పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు 2021 పేరుతో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాది భారత జీడీపీ మైనస్ 9.6 శాతంగా నమోదు కావచ్చని ఐరాస అంచనా వేసింది. ఈ ఏడాది మాత్రం 7.3 శాతం వృద్ధి కనిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2020 జీడీపీని లాక్‌డౌన్, ఇతర కరోనా నియంత్రణ చర్యలు దెబ్బతీశాయని పేర్కొన్నది.