
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నూతన వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి హనీమూన్ ఎంతో దోహదపడుతుంది. నచ్చిన ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా సమయం గడిపే అవకాశం కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆనందంగా గడపాల్సిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గ్రీస్ దేశంలోని సిఫ్నోస్ ద్విపంలో సోమవారం చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన నూతన దంపతులు, వారి పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన దంపతులను అలెగ్జాండర్ క్రోమీ, మేరీ ఈబర్ట్‌గా గుర్తించారు. వీరికి ఈ మధ్యే వివాహం జరగడంతో హనీమూన్ కోసం లండన్ నుంచి గ్రీస్ వచ్చారు. రాజధాని ఏథెన్స్ సమీపంలోని మార్కోపౌలో గ్రామం నుంచి వీరిద్దరూ ప్రైవేట్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన సిఫ్నోస్ ద్విపంలోని హెలిప్యాడ్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ల్యాండ్ అయ్యే క్రమంలో ప్రమాదం జరిగింది.
హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కొద్దిసేపటి ముందు ఇంజిన్ నుంచి విచిత్రమైన శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. గాల్లో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ అయి ఉంటుందా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇళ్ల సముదాయం మధ్యలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సోమవారం సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంపై గ్రీస్ విమానయాన భద్రతా సంస్థ విచారణ ప్రారంభించింది. గ్రీస్ దేశంలో ఇటీవల పర్యాటకులు చాలా మంది ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఏజియన్ సముద్రంలోని దీవుల సౌందర్యాన్ని చూస్తూ వేగంగా ప్రయాణించేందుకు పర్యాటకులు హెలికాప్టర్ సేవలను ఎక్కువగా వినియోస్తున్నారు. సాధారణంగా ఫెర్రీ మార్గంలో సిఫ్పోస్ దీవిని చేరుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ప్రకృతి రమణీయతతో ఆకర్షిస్తున్న గ్రీస్ దేశం దీవులను చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. రాజధాని ఏథెన్స్ నుంచి దాదాపు 195 కిలోమీటర్ల దూరంలో ‘సిఫ్నోస్’ ద్విపం ఉంది.