
అమెరికాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హాలీవుడ్ ప్రముఖులు నివసించే మాంటెసిటో ప్రాంతానికి బురద ముప్పు పొంచి ఉంది. ఓ వైపు విరిగి పడుతున్న బురద చరియలు.. మరో వైపు భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు మరింతగా బురద చరియలు విరిగిపడి విలాసవంతమైన భవనాలను ముంచెత్తే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఇక్కడి వాసులు వెంటనే నగరాన్ని వీడాలంటూ అధికారులు ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి మాంటెసిటో ఫైర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పేర్కొంది. అటు హాలీవుడ్ కమెడియన్ ఎల్లెన్ డిజెనెరెస్ కూడా నగరంలోని పరిస్థితిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతం నుంచి తప్పకుండా తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
తుపాను కారణంగా గత నెల రోజులుగా కాలిఫోర్నియా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాంటెసిటోలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. మరో 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బురదచరియలు విరిగిపడే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం పెరిగింది.
లాస్ఏంజిల్స్కు సమీపంలో ఉండే మాంటెసిటో అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు నివాసముంటున్నారు. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్ దంపతులతో పాటు అనేక మంది హాలీవుడ్ సినీ ప్రముఖులు ఇక్కడే నివాసముంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..