
సంకల్పం ఉంటే ఎడారిని కూడా అడవిగా మార్చవచ్చని చైనాకు చెందిన ఓ పర్యావరణ యోధురాలు నిరూపించింది. ఓ స్పాన్సర్ విసిరిన సవాల్‌తో ఏడారిని పచ్చని వనంలా మార్చేసింది. ఏళ్ల తరబడి శ్రమించి వేలాది మొక్కలతో పచ్చని అడవిని సృష్టించింది. పక్షులు, జంతువులకు ఆశ్రయంగా మార్చింది. ఎడారి తుఫాన్లు, ఇసుక గాలులతో తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను తీర్చింది. దృఢమైన సంకల్పంతో ఏడారిని అడవిగా మార్చింది చైనా నేచర్ లవర్ ఇన్ యుజెన్.
మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలి అంటుంటారు పెద్దలు. చైనాకు చెందిన ఒక పర్యావరణ యోధురాలు అంతకుమించే చేసింది. చైనాకు చెందిన ఇన్ యుజెన్ అనే పర్యావరణ ప్రేమికురాలు 27 ఏళ్ల క్రితం తనకు ఆర్థిక సాయం చేసిన ఓ అమెరికన్ టీచర్‌కు ఏడారిని అడవిగా మారుస్తానని మాటిచ్చారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం.. ఏళ్ల తరబడి శ్రమించి.. నిజంగానే ఎడారినే అడవిగా తయారు చేసి శభాష్ అనిపించుకుంది.
చైనాలోని నాలుగో అతిపెద్ద ఎడారి మౌవుసు.. ఒకప్పుడు ఇసుక మేటలతో నిండిన ప్రాంతం.. ఇలాంటి ఏడారిని పచ్చదనంతో నింపాలని నేచర్ లవర్ ఇన్ యుజెన్ ఫిక్స్ అయ్యారు. ఆమె ఆదాయం 250 డాలర్లే అయినా.. 14 ఏళ్ల పాటు ఇసుక తిన్నెలతో పోరాడారు. అయితే.. 1999లో ఇన్ యుజెన్ పోరాటాన్ని తెలుసుకుని అమెరికన్ టీచర్ రోనాల్డ్ సాకోల్‌స్కీ చలించిపోయారు. అమెరికా ఫౌండేషన్ల సాయంతో 5,000 డాలర్లను సేకరించి ఆమెకు తొలి విదేశీ విరాళంగా పంపారు. వాటిలో ఒక డాలర్ నోటును జ్ఞాపకార్థం ఉంచుకున్న ఇన్ యుజెన్.. మిగిలిన డబ్బుతో 50వేల మొక్కలు కొనుగోలు చేశారు. వాటితో ఏడారిలో అడవి సృష్టి కోసం ప్రయాణం ప్రారంభించారు.
ఈ క్రమంలో.. ఒకరోజు సాకోల్‌స్కీ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి.. పెన్సిల్ సైజులో ఉన్న చిన్నచిన్న మొక్కలను చూసి బతుకుతాయా? అడవి సాధ్యమేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మాటలకు రియాక్ట్ అయిన ఇన్ యుజెన్.. కొన్నేళ్ల తర్వాత రావాలని.. అప్పుడు అడవినే చూపిస్తానని మాట ఇచ్చారు. అంతే.. ఆ మాట ప్రకారం 27 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి.. ఏడారిని అడవిగా మార్చారు.
ఇక.. టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవడంతో ఆ టాస్క్ ఇచ్చిన సాకోల్‌స్కీ కోసం సెర్చింగ్ మొదలెట్టారు ఇన్ యుజెన్. అప్పట్లో దాచుకున్న పాత డాలర్ నోటుతో ఆయన కోసం ఆన్‌లైన్ వేదికగా అన్వేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన స్టూడెంట్స్ సాయంతో కొద్ది రోజుల్లోనే సాకోల్‌స్కీని కనిపెట్టేశారు. వీడియో కాల్ ద్వారా ఏడారిలో వెలిసిన పచ్చని అడవిని చూపెట్టారు. దీంతో.. సాకోల్‌స్కీ అడవిని చూసి కలా నిజమా అన్నంతగా ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా ఒక అద్భుతం అని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ డబ్బును సొంత అవసరాలకు వాడుకోకుండా.. ఎడారిని అడవిగా మార్చడం గ్రేట్ అని ప్రశంసించారు. త్వరలోనే చైనాకు వచ్చి పచ్చని అడవిని ఆస్వాదించాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఏ పనిలోనైనా అంకితభావం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఇన్ యుజెన్ నిరూపించారు. చైనా-అమెరికా దేశాల మధ్య పర్యావరణ యోధురాలు, టీచర్ మధ్య చిగురింపజేసిన ఈ పచ్చని స్నేహం ఇప్పుడు ప్రపంచ ప్రజల మనసు గెలుచుకుంటోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..