ఫ్రాన్స్‌లో మళ్లీ జడలు విప్పిన కరోనా, మరోసారి లాక్‌డౌన్‌ అమలు

ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించలేకపోతున్నాం! ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసులు పెరుగుతున్నాయి.. ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు..

ఫ్రాన్స్‌లో మళ్లీ జడలు విప్పిన కరోనా, మరోసారి లాక్‌డౌన్‌ అమలు

Updated on: Oct 29, 2020 | 11:56 AM

ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించలేకపోతున్నాం! ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసులు పెరుగుతున్నాయి.. ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.. మాస్కులు పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంత చెప్పినా చాలా మంది చెవికెక్కించుకోవడం లేదు.. అందుకే కేసులు తగ్గడం లేదు.. ఇక యూరప్‌ దేశాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు.. మొన్నీమధ్యనే బ్రిటన్‌లో కోవిడ్‌-19 నిబంధనలను కఠినతరం చేశారు.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు.. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు డిసెంబర్‌ ఒకటి వరకు నిబంధనలు అమలులో ఉంటాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకున్నారు.

యూరప్‌లోని మిగతా దేశాల్లాగే ఫ్రాన్స్‌లో కూడా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యిందన్నారు.. మొదటి దశ కంటే రెండో దశ మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ సోకి తీవ్ర అస్వస్థతకు లోనైన దాదాపు మూడు వేల మందికి మెరుగైన చికిత్స అందించడానికి హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేవంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇలాగే కొనసాగితే వచ్చే పక్షం రోజుల్లో దాదాపు తొమ్మిది వేల మందిని ఐసీయూలో చేర్పించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా మెలగకపోతే రాబోయే రోజుల్లో మరో నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని మాక్రాన్‌ హెచ్చరించారు.

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలలో రెండు వారాల కిందటే కర్ఫ్యూ విధించారు.. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్యను తగ్గించలేకపోయారు. రెండో దశ కరోనా వ్యాప్తిలో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 35 వేలకు పైగా మరణించారు.. రెండోసారి విధించిన లాక్‌డౌన్‌ను అధికారులు గట్టిగా అమలు చేస్తున్నారు.. బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపారసంస్థలన్నీ మూసేశారు.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.. ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇక వ్యాపారులను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించబోతున్నారు. లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల తర్వాత పరిస్థితిని అంచనా వేస్తామని, కరోనా వ్యాప్తి తగ్గిందనుకుంటేనే సడలింపులు ఉంటాయని, లేకపోతే మరింత కఠినంగా అమలు చేస్తామని మాక్రాన్‌ అన్నారు. క్రిస్‌మస్‌ పర్వదినం, న్యూ ఇయర్‌ వేడుకలు కుటుంబాలతో కలిసి జరుపుకొనే పరిస్థితులు రావాలని ప్రతి ఒక్కరము కోరుకుందామని చెప్పారు.