కోవిడ్ టెస్టుల్లో తేడాలు రావడమన్నది ఇక్కడే కాదు అమెరికాలోనూ ఉంది.. చిరంజీవి అంతటి మెగాస్టార్‌కే పాజిటివ్ అంటూ కాసేపు భయపెట్టిన పరీక్షలు అంతటా ఇదే రకమైన టెన్షన్‌ను పుట్టిస్తున్నాయి.. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏదో తేడా కొడుతోంది.. మరీ ముఖ్యంగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు వైరస్‌ను కచ్చితంగా గుర్తించలేకపోతున్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా కరోనా పరీక్షలపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆయనైతే పలు అనుమానాలను వ్యక్తపరిచారు. ఒకే రోజు నాలుగుసార్లు పరీక్షలు చేయించుకున్నానని, వీటిలో రెండు టెస్ట్‌ల్లో నెగెటివ్ వస్తే, మరో రెండు టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చిందని ఎలాన్ మస్క్ అన్నారు. ఒకే మిషన్, ఒకే పరీక్ష, ఒకే నర్సు.. అయినా ఫలితాల్లో తేడాలొచ్చాయి అని కామెంట్ చేశారు. ఇలా ఫలితాలు భిన్నంగా రావడంతో కంగారుపుట్టి మరో ల్యాబ్‌లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించున్నారట! రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారట! తనకు కొద్దిపాటి జలుబు తప్ప మరే కరోనా లక్షణాలు లేవన్నారు ఎలాన్ మస్క్. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల ఫలితాలు కచ్చితంగా రావడం లేదన్న విషయాన్ని నిపుణులు ఎప్పుడో చెప్పారు. అందుకే ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిన వారు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు కూడా!