Archaeological Discovery: అతిపురాతనమైన సంస్కృతి సంప్రదాయం గల దేశం ఈజిప్ట్. ఈ దేశ గురించి మనం తలచుకోగానే వెంటనే గుర్తుకొచ్చేవి మమ్మీలు, పిరమిడ్లు. ఎన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరని పిరమిడ్ కట్టడాల గురించి నాగరికతకు జన్మస్థానంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.
సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఓల్డ్ కింగ్‌డమ్ ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో ఓ పురాతన శవపేటికను, పురాతన ఆలయాన్ని గుర్తించింది.
క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నాటి చెక్క శవపెటిక భూమికి 40 అడుగుల లోతులో బయటపడిందని ఆర్కియాలజిస్టు చెప్పారు. దీనిపై మరింత పరిశోధన జరిపితే సక్కారా ప్రాంత చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 ఏళ్ల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుందన్నారు. ఈ శవ పేటికతో పాటు 22 బాణాలు కూడా బయల్పడ్డాయని హవాస్ చెప్పారు. ఒక సైనికుడు పక్కనే అతని గొడ్డలి ఉందని అన్నారు. అంతేకాదు ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది “కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం” అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటపడిన వస్తువులపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు.
Also Read: మంత్రి కేటీఆర్‌ను కలిసిన సిడ్నీటెస్టు హీరో తెలుగు తేజం హనుమ విహారి