Death Penalty: లంచాలు తీసుకోవడం అనేది చాలా మందిలో విషాదం నింపింది. మన దేశంలో లంచగొండ అధికారుల అగడాలు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలున్నాయి. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఇది మన దేశంలో కాదు.. చైనాలో. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్ కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణ శిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేరకు అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
చైనా అతిపెద్ద ప్రభుత్వ నియంత్రణ ఆర్థిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్ గా పని చేశారు. అయితే కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గత సంవత్సరం జనవరి నెలలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్ లోని తన అపార్టుమెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు అందులో బయటపడ్డ నగదును చూసి షాక్ కు గురయ్యారు. అక్రమార్జన కోసం లై షియోమిన్ తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఆయన లంచం తీసుకున్న విషయాన్ని చాలా పెద్ద నేరంగా, తీవ్రమైనదిగా భావించింది కోర్టు. ఇక లైషియోమిన్ ఉద్దేశ పూర్వకంగా తీవ్రమైన హానికర చర్యను పాల్పడ్డారని కోర్టు మండిపడింది. లైషియోమిన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్దంగా పిల్లలను కన్నట్లు కూడా నిర్ధారణ అయింది. హువారంగ్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీకి ఛైర్మన్ గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమైంది. అలాగే లంచంగా ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్లు అంగీకరించాడు. దీంతో లై షియోమిన్ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు మరణ శిక్ష విధించింది.