
కెనడాకు చెందిన ప్రముఖ కవయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు, పండితురాలు ఆన్ కార్సన్‌కు 2026 సాహిత్య నోబెల్ బహుమతి దక్కింది. కవిత్వం, వ్యాసం, అనువాదం, ప్రాచీన సాహిత్యం, కల్పనా రచనల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేసినందుకు ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
1950లో టొరంటోలో జన్మించిన కార్సన్.. చిన్నప్పటి నుంచే ప్రాచీన గ్రీకు సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. టొరంటో విశ్వవిద్యాలయంలో క్లాసిక్స్ చదివి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రాచీన గ్రీకు సాహిత్యం, పురాణాలు ఆమె రచనల్లో కీలక పాత్ర పోషించాయి. కవయిత్రిగానే కాకుండా అనువాదకురాలిగా, వ్యాసకర్తగా, అధ్యాపకురాలిగా కూడా ఆమె విశేష గుర్తింపు పొందారు.
కార్సన్ రచనా ప్రత్యేకతకు ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్’ మంచి ఉదాహరణ. 1998లో వెలువడిన ఈ పద్య నవల ప్రాచీన గ్రీకు పురాణంలోని గెరియాన్ కథ ఆధారంగా రూపొందింది. హెరాకిల్స్ చేతిలో హతమైన రెక్కల రాక్షసుడి కథను కార్సన్ ఒక సున్నితమైన యువకుడి ప్రేమ, ఎదుగుదల, వ్యక్తిత్వ అన్వేషణ కథగా మలిచారు. అలాగే ఎలెక్ట్రా, సాఫో వంటి ప్రాచీన గ్రీకు రచనలను అనువదించడం ద్వారా తన శాస్త్రీయ పాండిత్యాన్ని సృజనాత్మక రచనతో మేళవించారు.
2026 నోబెల్ రేసులో కార్సన్ పేరు ముందంజలోనే ఉంది. సాహిత్య ప్రక్రియల మధ్య గీతలను ప్రశ్నిస్తూ దశాబ్దాలుగా సాగించిన ప్రయోగాత్మక రచనకు ఈ పురస్కారం అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..