Afghanistan Crisis: తాలిబన్ల రాజ్యంలో అప్పుడే మహిళలపై ఆంక్షలు మొదలైపోయాయి. ఆఫ్గన్ లో అప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకూ స్వేచ్ఛగా తిరిగిన మహిళలు బుర్ఖాలు వేయడం మొదలు పెట్టారు. ఇప్పటివరకూ తమకు నచ్చినట్లుగా యాంకరింగ్, రిపోర్టింగ్ చేసిన మహిళా జర్నలిస్టులు సైతం ఇప్పుడు బుర్ఖాలు ధరిస్తున్నారు. తాలిబన్స్ అంటే హడలిపోతున్న మహిళలు పెద్దఎత్తున బుర్ఖాలు కొనుగోలు చేస్తున్నారు. దాంతో, కాబూల్ లో ఎన్నడూ లేనంతగా బుర్ఖాలు అమ్ముడుపోతున్నాయి.
ఇక ఆఫ్గన్ తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించిన నీలోఫర్ రెహమాన్ మాటలు వింటే తాలిబన్ల పాలనపై ఆఫ్గన్ల భయాందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ అంతర్జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన నీలోఫర్.. తాలిబన్ల అరాచకంపై తన ఆందోళనను వ్యక్తం చేసింది. మహిళల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తున్నారంటూ నీలోఫర్ రెహమాన్ ఆవేదన వ్యక్తంచేసింది. మహిళల పట్ల వివక్ష చూపబోమన్న తాలిబన్ల మాటలను నమ్మొద్దంటూ ఆఫ్గన్ మహిళలను హెచ్చరిస్తోంది. తాలిబన్లు మహిళల హక్కులు, స్వేచ్ఛను కాలరాస్తారని, చిత్రహింసలు పెట్టి చంపుతారని భయాందోళన వ్యక్తం చేసింది. తాను పైలట్ కావడానికి సహకరించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డారంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. వారిని తాలిబన్లు బ్రతకనీయరంటూ బోరున విలపిస్తోంది.
మరోవైపు ఆఫ్గన్ రేడియో అండ్ టెలివిజన్ లో పనిచేస్తున్న యాంకర్ షబ్నమ్ ను తాలిబన్లు తిప్పిపంపేశారు. పాలన మారింది, ఇక ఉద్యోగానికి రావొద్దంటూ తనను పంపేశారంటూ జర్నలిస్ట్ షబ్నమ్ వీడియో రిలీజ్ చేసింది. హిజాబ్ ధరించినా తనను ఉద్యోగానికి రానివ్వలేదని, తన ఛాంబర్ ను కూడా ధ్వంసం చేశారని షబ్నమ్ ఆవేదన వ్యక్తంచేసింది. ఆఫ్ఘాన్ లో మహిళల హక్కుల కోసం పోరాడుతానని, మద్దతు తెలపాలంటూ షబ్నమ్ కోరింది. కాగా, ఈ రేడియో అండ్ టెలివిజన్‌ను ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం నడుపుతోంది. ఈ టీవీలో గత కొద్ది రోజులుగా తాలిబన్లకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఛానల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు తాలిబన్ల మాటలకు చేతలకు పొంతన లేదని చెప్పడానికి.
కాగా, గతంగతహా.. జరిగిందేదో జరిగిపోయింది.. మేం ఇప్పుడు మారిపోయాం.. ఎవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తాలిబన్లు కల్లబొల్లి ప్రకటనలు చేస్తున్నారు. తాము మహిళలకు వ్యతిరేకంగా కాదంటు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటిలాగే మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చునని, పాలనలోనూ భాగం కావొచ్చంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కానీ, తాలిబన్ల మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఒకవైపు తాము మారిపోయాం అంటూనే మరోవైపు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆఫ్గన్ ను అలా ఆక్రమించుకున్నారో లేదో టైట్ డ్రెస్ వేసుకుని ఉందని, బుర్ఖా ధరించలేదని ఓ మహిళను నడిరోడ్డుపైనే కాల్చిచంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుంతోంది. బ్యూటీ పార్లర్ ను ధ్వంసంచేసి మహిళల ఫొటోలు తొలగించారు. అందుకే, తాలిబన్ల మాటలను నమ్మలేమంటున్నారు ఆఫ్గన్లు. వారి భయంతో దేశాన్ని విడిచి వెళ్తున్నారు.
Also read:
Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్ షాట్ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!
Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!