రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయుల మృతి..విదేశాంగ శాఖ వెల్లడి

వంటవాళ్లు, సైన్యంలో సహాయకుల పనుల కోసం రష్యా సైన్యంలో చేరిన భారతీయుల విషయంలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీరిని బలవంతంగా యుద్ధరంగంలోకి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వీరిలో 51 మంది ప్రాణాలు కోల్పోయారని భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. కిర్గిజిస్థాన్‌లో విక్రమ్ మిశ్రీ ఈ విషయం వెల్లడించారు

రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయుల మృతి..విదేశాంగ శాఖ వెల్లడి
51 Indians Recruited In Russian Army Die

Updated on: Sep 01, 2026 | 4:24 PM

 

రష్యా సైన్యంలోని 51 మంది భారతీయులు మరణించారని కిర్గిజిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. నిజానికి, రష్యా సైన్యంలో పోరాడేందుకు కాకుండా వంటవాళ్లు, సహాయకుల పనుల కోసం భారతీయులను నియమించుకున్నారు.  కానీ వీరిని బలవంతంగా యుద్ధరంగంలోకి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా మోసపూరిత ఏజెంట్ల ద్వారా వచ్చే ప్రమాదకర ఉద్యోగ ఆఫర్లను నమ్మవద్దని కేంద్రం పదే పదే యువతను హెచ్చరించింది.

ఈ అంశంపై సుప్రీంకోర్టు కలగచేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలతో సమన్వయం చేసుకునేందుకు విదేశాంగ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇంకా దాదాపు రెండు డజన్ల మంది భారతీయులు రష్యా సైన్యంలోనే ఉన్నారని, వారి విడుదల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. వీరిని వీలైనంత త్వరగా వెనక్కి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.  భారతీయులు త్వరగా సైన్యం నుంచి బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రష్యాను కోరినట్టు చెప్పారు.

మొత్తం 227 మంది రష్యా సైన్యంలో చేరగా 139 మంది బయటకు వచ్చేశారు. మిగిలిన వారినీ వెనక్కి తీసుకొచ్చేందుకు రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ లో పర్యిటిస్తున్న సందర్భంగా కిర్గిస్థాన్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సెక్రటరీ మిశ్రీ సమాధానం ఇచ్చారు.

ఇదే సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన కొద్దిసేపటికే విక్రమ్ మిశ్రీ ఈ ప్రకటన చేయడం విశేషం. పుతిన్‌తో భేటీ సందర్భంగా, గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం పై ప్రధాని మాట్లాడారు. “వరుస యుద్ధాల నుంచి యుద్ధానికి ముగింపు” పలకాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ కామెంట్ చేసారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us