మెక్సికోలోని మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అతడు చేసిన పనికి ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సోనోరా రాష్ట్రంలోని శాన్ లుయిస్ రియో కొలరాడోలో ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లాడు. అక్కడ పీకల దాకా మద్యం తాగాక బార్‌లో ఉన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బార్ సిబ్బంది అతడ్ని బయటకు పంపించేశారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో అతడికి గొడవ జరిగింది. అయితే బయటకు వచ్చిన ఆ వ్యక్తి కొద్దిసేపటి తర్వాత ఓ పెట్రోల్ బాంబు తీసుకొచ్చి.. ఆ బార్‌పై దాడి చేశాడు.
దీంతో ఒక్కసారిగా బార్‌లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. లోపల ఉన్నవారు హాహాకారలు పెట్టారు. బార్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఒక్కటే దారి ఉండటంతో కొందరు లోపలే చిక్కుకుపోయారు. అయితే ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు ఆరుగురు కాగా.. 5 గురు పురుషులు. అలాగే మరికొందరు కూడా గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. నిందుతుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.