ఈ సారైనా.. హుజూర్ నగర్‌లో కారు పరుగెడుతుందా..!

Will TRS Win Huzurnagar by Poll?, ఈ సారైనా.. హుజూర్ నగర్‌లో కారు పరుగెడుతుందా..!

హుజుర్ నగర్‌ ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉండటంతో.. శనివారం ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ స్థానం ఎవరికి చిక్కుతుంది. హస్తానికి ఇది నియోజకవర్గం కంచుకోట లాంటింది. మరి ఈ కంచుకోటను కారు పార్టీ బద్దలు కోడుతుందా..? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈసీ షెడ్యూల్ విడుదలకు ముందే కేసీఆర్ తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రతిపక్షాలకు సవాల్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అయితే తొలుత ఈ స్థానం నుంచి నిజామాబాద్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత బరిలోకి దిగనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అధినాయకుడు కేసీఆర్ మాత్రం అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేయకుండా సైదిరెడ్డిని ప్రకటించారు. అయితే గత మూడు పర్యాయాలుగా ఇక్కడ టీఆర్ఎస్ గెలవలేదు. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

అయితే గతంలో 2009,2014,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుంటే.. ఇదే స్థానం నుంచి టీపీసీసీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గెలుస్తూ హ్యాట్రిక్ సాధించారు. అయితే అనివార్య కారణాల వల్ల నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ స్థానంలో మొత్తం 16 మంది పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు రాగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. టీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. అయితే కేవలం 7466 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు. ఇక స్వతంత్ర్య అభ్యర్థి రఘుమారెడ్డి 4,955 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఇక సీపీఎం పార్టీకి 2,121 ఓట్లు రాగా, బీజేపీకి కేవలం 1,555 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక 2014 , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు 69879 ఓట్లు రాగా టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. దీంతో 23వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు. అంతేకాదు 2009 ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ ఓటమిపాలైంది. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 80,835 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జగదీష్ రెడ్డి (ప్రస్తుత మంత్రి) కి 51,641 ఓట్లు వచ్చాయి.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి పేరు దాదాపు ఖరారు కావడంతో.. పోటీ హోరాహోరిగా ఉండనుంది. అయితే అధికార పార్టీ ఈ సారి ప్రతిష్టాత్మకంగా హుజూర్ నగర్ ఎన్నికను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ సారి ఉత్తమ్ కంచు కోటను బద్దలు కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు కూడా లేకపోవడంతో.. హుజూర్ నగర్‌ గెలుపును మంత్రుల చేతిలో పెట్టబోతున్నట్లు సమాచారం. అందుకోసం ప్రతి మండలానికి ఓ మంత్రిని ఇంచార్జ్‌గా బాధ్యతలు ఇస్తే.. హుజూర్‌ నగర్ గెలుపు ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న వర్గ బేధాలను అవకాశంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితే.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయన్న ఆలోచనతో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరి హుజూర్ నగర్ ప్రజల మనసులో ఏం ఉందో.. కారును పరిగెత్తిస్తారా.. లేక హస్తానికి షాకిస్తారా.. అన్నది మరో నెల రోజుల్లో తేలుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *