బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు వాయు‘గండం‘

రెండు తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం' పొంచి వుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని ప్రకటించారు.

బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు వాయు‘గండం‘
Follow us

|

Updated on: Oct 10, 2020 | 2:48 PM

Weather warning for Telugu states: రెండు తెలుగు రాష్ట్రాలకు వాయు’గండం’ పొంచి వుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతాయని తెలిపారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం వుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

శని, ఆది, సోమవారాల్లో (మూడు రోజుల పాటు) తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఆగ్నేయం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉందని ఆమె వివరించారు.

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వుందని శ్రావణి తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీరం దాటే అవకాశం వుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు కోస్త్రాంధ్ర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆమె వివరించారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉరుములు మెరుపులతో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించిన శాస్త్రవేత్త శ్రావణి.. అక్టోబర్ 14వ తేదీన మధ్య, పశ్చిమ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం వుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాద్, హైదరాబాద్ నగరాల్లో భారీ వర్షం కురిసిందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురిసిందని ఆమె వివరించారు.

Also read: రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!