20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి

Updated on: Nov 24, 2025 | 5:27 PM

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు యువతకు ఇచ్చిన పెళ్లి, పిల్లల సలహా పెద్ద దుమారం రేపింది. ఉపాసన కొణిదెల పోస్ట్‌కు స్పందనగా, 20 ఏళ్లకే పెళ్లిని "పూర్వీకుల విధి" అన్నారు. అయితే, నెటిజన్లు దీనిని ఆర్థిక సంక్షోభంగా చూస్తున్నారు. మహిళలు కెరీర్‌పై దృష్టి సారిస్తున్నారని, అధిక జీవన వ్యయాలు, ఆదాయ అస్థిరత వల్లే వివాహం వాయిదా పడుతోందని వాదిస్తున్నారు. Vembu దీనిని సాంస్కృతిక సమస్యగా అభివర్ణించారు.

యువతీయువకులు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని, ఇది మన పూర్వీకుల పట్ల నిర్వర్తించాల్సిన “విధి” అని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు యువతకు ఇచ్చిన సలహా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ పాతకాలపు ఆలోచనలకు భవిష్యత్తులో మళ్లీ ఆదరణ పెరుగుతందని తను విశ్వసిస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. ఉపాసన కొణిదెల చేసిన ఓ పోస్టుకు స్పందనగా శ్రీధర్ వెంబు తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగా చాలామంది భావిస్తున్నారు. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఉపాసన మాట్లాడారు. ఆ సందర్బంగా ఆమె ‘మీలో త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు?’ అని అడగగా, అబ్బాయిలే ఎక్కువ సంఖ్యలో చేతులెత్తారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ.. అమ్మాయిలు తమ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారని, అందుకు వారు ఎక్కువ సంఖ్యలో చేతులెత్తలేదని, ఇది ఉద్యోగాల్లో, శ్రమవాటాలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యానికి ఒక ఉదాహరణ అంటూ.. తన అనుభవాన్ని ట్వీట్ చేశారు. కాగా, శ్రీధర్ వెంబు సలహాపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది జనాభా సంక్షోభం కాదని, ఆర్థిక సంక్షోభమని పలువురు వాదించారు. అస్థిరమైన ఆదాయాలు, అధిక పని గంటలు, పెరిగిన జీవన వ్యయాలు, ఇంటి అద్దెలు వంటి సమస్యల వల్లే చాలామంది పెళ్లి, పిల్లల బాధ్యతను వాయిదా వేసుకుంటున్నామని కామెంట్లు పెట్టారు. ముఖ్యంగా మహిళలు, 20 ఏళ్లలో పిల్లల్ని కంటే తమ కెరీర్ దెబ్బతింటుందని కామెంట్లలో రాసుకొచ్చారు. ఈ విమర్శలపై శ్రీధర్ వెంబు స్పందించారు. నెటిజన్ల వాదనను గౌరవిస్తూనే.. ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా త్వరగా పెళ్లి చేసుకోవడం లేదని గుర్తుచేశారు. ఒకరకంగా ఇది సాంస్కృతిక సమస్యేనని అన్నారు. జీవితం ఒక పరుగుపందెం కాదని, ఏ వయసులోనైనా రాణించడానికి అవకాశం ఉంటుందని బదులిచ్చారు. కాగా, శ్రీధర్ వెంబు ప్రస్తుతం తన భార్యతో విడాకుల కేసును ఎదుర్కొంటున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో ఆయనపై ఆరోపణలు ఉన్న వేళ, ఆయన ఇలాంటి సలహాలు ఇవ్వడంపై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జోహో, శ్రీధర్‌ వెంబు, అరట్టై పదాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపుతో మంత్రులు అరట్టై ను ప్రమోట్‌ చేసారు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌పాయింట్ బదులు జోహోతో కేబినెట్‌ ప్రజెంటేషన్‌ తయారుచేసారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌కు బదులు జోహో మెయిల్‌కు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ షిఫ్ట్‌ అయ్యారు. దాంతో వాట్సప్‌కు పోటీగా జోహో తీసుకొచ్చిన స్వదేశీ అరట్టై యాప్‌కి ఆదరణ పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతమంది జనం మధ్య సిగ్గు లేని పని చేశాడు.. ఆ తరువాత

ఆ స్టేషన్‌లో ఎయిర్‌పోర్టును మించిన లగ్జరీలు

ఈ సూపర్‌ మార్కెట్‌లో అన్నీ ఫ్రీనే

రూ. 8 లక్షల కారులో వచ్చి.. రూ. 8 పేపర్‌ను దొంగిలించాడు

చలికాలంలో పెదవులు పలిగిపోతున్నాయా ?? ఇది మీకోసమే