యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?

Updated on: Jan 31, 2026 | 9:18 AM

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అవినీతి వరుస ఘటనలు భక్తుల్లో ఆందోళన రేపుతున్నాయి. తాజాగా రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి డాలర్లు మాయమైనట్లు ఆడిట్‌లో వెల్లడైంది. గతంలో చింతపండు చోరీపై చర్యలు లేకపోవడం దీనికి కారణమని భక్తులు భావిస్తున్నారు. దేవస్థానంలో జరుగుతున్న ఈ అక్రమాలపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి ఘటనలు భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భక్తులు అపార విశ్వాసంతో స్వామివారికి సమర్పిస్తున్న కానుకలపై కొంతమంది అధికారులు, సిబ్బంది కన్నేయడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఆలయంలో భక్తులకు విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోట్లాది రూపాయల వ్యయంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోజుకు 30 నుంచి 50 వేల మంది భక్తులు వస్తుండగా, పండుగలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్షను దాటుతోంది. భక్తుల రద్దీతో పాటు స్వామివారి ఖజానాకు కూడా భారీ ఆదాయం వస్తోంది. తిరుమల తరహాలో యాదాద్రి ఆలయంలో కూడా లక్ష్మీనరసింహస్వామి ప్రతిమతో కూడిన బంగారు, వెండి డాలర్లను భక్తులకు విక్రయిస్తున్నారు. ఈ డాలర్లను ప్రచార శాఖ ద్వారా, ఈవో పర్యవేక్షణలో భద్రపరచి విక్రయాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్‌లో తయారు చేయించిన 200 బంగారు డాలర్లు, 1000 వెండి డాలర్లు దేవస్థానం వద్ద నిల్వ ఉంటాయి. అయితే ఈ డాలర్లు ఏడాది క్రితమే మాయమైనట్లు ఇటీవల ఆడిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేలింది. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. ఇదే ఆలయంలో ఆరు నెలల క్రితం స్వామివారి ప్రసాదానికి ఉపయోగించే చింతపండు చోరీ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆ ఘటనపై సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. స్వామివారి సేవ పేరిట జరుగుతున్న ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్‌ మామూలుగా లేదుగా.. వేట చూస్తే మైండ్ బ్లాక్