పెళ్లి వేడుకపై అమెరికా భీకర దాడి.. ‘బిగ్గెస్ట్ అటాక్’ ఇంకా మిగిలే ఉంది.. ట్రంప్ సంచలన వార్నింగ్
అమెరికా–ఇరాన్ మధ్య ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని IRGC, రాడార్ వ్యవస్థలపై అమెరికా దాడులు చేయగా.. జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై దాడిలో చిన్నారితో సహా ఐదుగురు మృతి చెందారన్న వార్తలు ఆందోళన పెంచుతున్నాయి. ట్రంప్ హెచ్చరికలతో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది.
అమెరికా–ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న ఉద్రిక్తత.. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌లో అమెరికా దాడులు చేస్తే.. ప్రతిగా ఇరాన్ కూడా జోర్డాన్, గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, ఇతర లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది.అయితే.. ఈ పరస్పర దాడుల్లో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో చిన్నారితో సహా ఐదుగురు చనిపోగా.. దాదాపు 68 మంది గాయపడ్డారని సమాచారం. అసలు అమెరికా ఎందుకు దాడులు చేసింది? దీనిపై ఇరాన్ స్పందనేంటి? ట్రంప్ ఎందుకు.. ‘బిగ్గెస్ట్ అటాక్ ఇంకా మిగిలే ఉంది’ అంటూ హెచ్చరించారు? ఈ పరిణామాలు ఎటు దారితీయబోతున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అమెరికా దాడులకు అసలు కారణమేంటనేది చూస్తే.. అమెరికా సైన్యం ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. అంటే IRGCకి చెందిన లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా ఇరాన్ రాడార్ వ్యవస్థలను టార్గెట్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తన రాడార్ వ్యవస్థను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిందని.. అది దాదాపు పూర్తయ్యే సమయంలో అమెరికా దాడి చేసిందని ట్రంప్ వెల్లడించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై, అలాగే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనికులపై IRGC దాడులకు ప్రయత్నించిందని.. వాటికి ప్రతిస్పందనగానే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే అమెరికా దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని కుహెస్టాక్ ప్రాంతంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దాడి జరిగిందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో చిన్నారితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. కనీసం 68 మంది గాయపడ్డారని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ వివరాలు ఇరాన్ ప్రభుత్వ మీడియా ద్వారా వెలువడ్డాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా సైన్యం ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదని స్పష్టం చేసింది. దీంతో ఈ ఘటనపై ఇరాన్–అమెరికా మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. అమెరికా దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. జోర్డాన్ వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జోర్డాన్‌లోని గల్ఫ్ ఆఫ్ అకాబా తీర ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. మొత్తం 13 క్షిపణులు ప్రయోగించగా.. వాటిలో 10 క్షిపణులను జోర్డాన్ రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు అక్కడి సైన్యం తెలిపింది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది. అకాబా ఆకాశంలో పేలుళ్లు కూడా కనిపించాయి. ఇక, ఇరాన్ ప్రతిదాడులు జోర్డాన్‌తోనే ఆగలేదు. కువైట్‌పై కూడా డ్రోన్ దాడులు జరిగాయని.. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయని కువైట్ సైన్యం తెలిపింది. అలాగే బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడిపై బహ్రెయిన్ నుంచి వెంటనే అధికారిక ధ్రువీకరణ రాలేదు. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాల భద్రతపై కూడా ఆందోళన పెరుగుతోంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా తమ భూభాగంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ప్రకటించింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌కు తూర్పున ఉన్న చాబహార్, కొనారక్ ప్రాంతాల్లో నాలుగు ప్రాజెక్టైల్స్ పడినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపింది. ఈ ఘటనల్లో ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై మాత్రం స్పష్టమైన సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఈ దాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఇరాన్ తమపై ప్రతిదాడికి దిగితే.. దానికంటే చాలా తీవ్రమైన స్థాయిలో అమెరికా దాడులు చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు.. ‘అతి పెద్ద దాడి ఇంకా ముందుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ ప్రతిదాడి చేస్తే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చాలా తీవ్రమైన నష్టం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే, అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా కొత్త దాడులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ కూడా ప్రకటించారు. అంటే.. ఇప్పుడు ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మాత్రమే కాదు.. ప్రత్యక్ష సైనిక దాడులు కూడా మళ్లీ తీవ్రం అవుతున్నాయి. ఈ మొత్తం పరిణామాల్లో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చాలా కీలకమైన ప్రాంతం. ప్రపంచ చమురు రవాణాలో ఈ సముద్ర మార్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే ఆరు నెలలుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా నౌకాదళం ఆంక్షలు, నావల్ బ్లాకేడ్ కొనసాగిస్తుండగా.. వాణిజ్య నౌకల రాకపోకలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇప్పుడు దాడులు మరింత పెరిగితే చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రపంచ మార్కెట్లలో కూడా ఆందోళన పెరుగుతోంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. కొంతకాలం క్రితం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై సైనిక చర్య కంటే ఆర్థిక ఒత్తిడికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రయత్నించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసి.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి తీసుకురావాలని భావించింది. ట్రంప్ దీనిని ‘ఎకనామిక్ డీ-డే’గా అభివర్ణించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్లీ సైనిక దాడుల దిశగా వెళ్లడం.. అమెరికా వ్యూహంలో మరోసారి మార్పు వచ్చిందన్న సంకేతాలను ఇస్తోంది. ఇరాన్‌పై దాడులు చేయడం అమెరికాకు కూడా సవాళ్లను తీసుకొస్తోంది. అధునాతన ఆయుధాల నిల్వలు తగ్గుతున్నాయన్న ఆందోళన పెరిగింది. మరోవైపు అమెరికా ప్రజల్లో ఈ యుద్ధంపై అసంతృప్తి ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఈ యుద్ధం రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా సమస్యగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. అమెరికా–ఇరాన్ మధ్య ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న ఘర్షణ ఇప్పుడు మరో ప్రమాదకర దశలోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. అమెరికా రాడార్‌లు, IRGC లక్ష్యాలపై దాడులు చేస్తుంటే.. ఇరాన్ జోర్డాన్, కువైట్, బహ్రెయిన్ వంటి ప్రాంతాల్లో క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేస్తోంది. అదే సమయంలో పౌర ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగిందన్న వార్తలు పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో చెబుతున్నాయి. ఇక ట్రంప్ ‘బిగ్గెస్ట్ అటాక్ ఇంకా మిగిలే ఉంది’ అన్న హెచ్చరిక.. ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఇరాన్ తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అమెరికా నిజంగానే మరింత భారీ దాడులకు దిగుతుందా? స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌పై ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లను ఎంతవరకు కుదిపేస్తుంది? ఈ ప్రశ్నలకు రానున్న పరిణామాలే సమాధానం చెప్పాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్ తల్లికి RGV కౌంటర్
Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
Jailer 2: విజయ్ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ
TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్
