Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. ఏది అడిగినా ఇచ్చేస్తా
ఢిల్లీలో జరిగిన అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 250వ వార్షికోత్సవ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ లైవ్ కాల్ ద్వారా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తన స్నేహితుడని, భారత్‌తో అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో మార్కో రూబియో, జైశంకర్ మధ్య కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడైంది.
భారత పర్యటనలో ఉన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరుగా ఫోన్‌లో లైవ్‌లోకి వచ్చి, భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించిన ట్రంప్, తాను ఆయనకు పెద్ద అభిమానినని అన్నారు. ఢిల్లీలో అమెరికా స్వాతంత్య్ర ప్రకటన 250వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న భారీ స్క్రీన్‌పై ట్రంప్ ప్రత్యక్షమై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్..ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని, ఆయన తన స్నేహితుడని పేర్కొన్న ట్రంప్.. భారత్‌తో అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. భారత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా, వారు తమకు కాల్ చేయవచ్చని, తమ దేశం వంద శాతం అండగా ఉంటుందని ట్రంప్ హామీ ఇచ్చారు. అంతేకాదు, తాను మోదీకి పెద్ద అభిమానినని, భారత్‌కు ఏం కావాలన్నాఇస్తామని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్జియో ద్వారా ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు రావాల్సిందిగా ట్రంప్ తరఫున ఆహ్వానం కూడా అందింది. మార్కో రూబియో అమెరికా చరిత్రలోనే గొప్ప సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని ట్రంప్ ప్రశంసించారు. మరోవైపు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తన పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని రూబియో వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా, స్థిరంగా ఉంటుందని ఆయన తెలిపారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇద్దరు నేతలు చర్చించారు. అమెరికా తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం, టారిఫ్‌లపై నెలకొన్న ఆందోళనల నడుమ రూబియో పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్య అసమతుల్యతను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే తమ విధానాలు ఉన్నాయని, ఇది కేవలం భారత్‌ను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా న్యాయమైన వాణిజ్య వ్యవస్థను సృష్టించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!
