భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు
వరంగల్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరడంతో ఆ మార్గంలో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు భారీ వరదలో చిక్కుకుపోయాయి. బస్సుల్లో ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు.
అన్నారం, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో వరంగల్ చేరుకున్నాయి. అయితే, ఉదయం కురిసిన కుండపోత వానకు రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. లోతును అంచనా వేయడంలో పొరబడిన డ్రైవర్లు బస్సులను ముందుకు పోనిచ్చారు. దీంతో వరదలో దాదాపు సగం వరకూ మునిగిపోయిన బస్సుల ఇంజిన్లు ఆగిపోయి మొరాయించాయి. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే ఇంతేజార్ గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు ఓ పెద్ద తాడు సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులంతా సేఫ్‌గా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. వాహనాలను దారి మళ్లించారు. సత్వరం స్పందించి తమను కాపాడిన పోలీసులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త
అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్
కారు, బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే కాస్త ఆగండి..
