అగ్నిప్రమాదంలో పిల్లలను కాపాడుకునేందుకు తల్లి సాహసం వీడియో

Updated on: Apr 19, 2025 | 2:34 PM

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిష్కార్‌ అపార్ట్‌మెంట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న జనాన్ని ఫైర్‌ సిబ్బంది కాపాడారు. అయితే, తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది. బాల్కనీ మీదుగా చిన్నారులను రక్షించి.. ఆ తర్వాత కిందకి దూకేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తులో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసం చేసింది. తొలుత చిన్న కుమార్తెను గాల్లో వేలాడదిస్తూ రక్షించాలని కోరగా.. స్థానికులు ఆమెను కాపాడారు. పెద్ద కుమార్తెనూ అదే విధంగా జార విడిచింది. ఆపై తను కూడా బాల్కనీ నుంచి కిందకు ప్రమాదకరంగా వేలాడుతూ ఇద్దరు వ్యక్తుల సాయంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని 20 మంది అపార్ట్‌మెంట్‌ వాసులను రక్షించారు. తర్వాత మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.